-తాగునీటి సమస్య పరిష్కారంపై వాంబే కాలనీవాసుల హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ ముందస్తు చర్యలు చేపట్టినట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. వాంబే కాలనీలో ఎఫ్ బ్లాక్ లో 60 వ డివిజన్ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి శనివారం ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గత పర్యటనతో సమస్య పరిష్కారమైందని.. మూడు రోజులుగా నిరంతరాయంగా నీటి సరఫరా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రజలకు త్రాగునీరు, రోజువారి గృహ అవసరాలకు నీటిని వేర్వేరు సమయాలలో అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. మోటార్లు ఉపయోగించకుండానే చివరి గడప వరకు నీరు అందాలన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లకు విద్యుత్ సదుపాయం కల్పించినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటితో పాటు వాటర్ ట్యాంకర్లను కూడా వేసవి ముగిసేవరకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వందశాతం నీటిసరఫరా ఖచ్చితంగా జరగాలని.. ఎక్కడా కూడా తాగునీటి కోసం ప్రజలు వేచి ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. తాగునీటి సరఫరాపై కిందిస్థాయి సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా స్థానికులకు సూచించారు. అవసరం లేని సమయాలలో కుళాయిలకు మూతలు బిగించాలన్నారు. అనంతరం నీటిలో క్లోరిన్ శాతం పరిమిత స్థాయిలో ఉన్నది లేనిది మీటర్ ద్వారా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని వీధులలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. జి బ్లాక్ f సెంటర్ వద్ద రైల్వే ట్రాక్ వెంబడి రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల దుర్గారావు, కిరణ్, ఇస్మాయిల్, ఫాతిమా, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News