-వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి
-సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు వాలంటీర్ల సేవలు అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని ఎస్.టి.వి.ఆర్. ప్రభుత్వ పాఠశాల నందు 27, 28, 29 డివిజన్లకు సంబంధించి నిర్వహించిన సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లీశ్వరి, కొంగితల లక్ష్మీపతిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వాలంటీర్లు కుటుంబ సభ్యుల్లా తోడుగా ఉంటున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు బెదిరించినా వాలంటీర్లు మాత్రం తమ విధి నిర్వహణలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కనుకనే తన ప్రతి ప్రసంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను కొనియాడుతూనే ఉంటారని గుర్తుచేశారు. పార్టీ యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కానీ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబుది రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ఓవైపు వాలంటీర్ల వ్యవస్థను తానే తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటూనే.. మరోవైపు విమర్శలు గుప్పించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
సంక్షేమ పథకాలన్నీ శాచ్యురేషన్ పద్థతిలో ప్రజలందరికీ చేరువ కావాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతి నెలా సంక్షేమ క్యాలెండర్ లోని పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అర్హులందరూ ఆయా పథకాలను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పాలన వ్యవస్థను భ్రష్టుపట్టించాయని మండిపడ్డారు. మరీముఖ్యంగా టిడ్కో ఇళ్ల విషయంలో చేసిన అవినీతి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పాపాలకు బలైన లబ్ధిదారులను ఆదుకునే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని మల్లాది విష్ణు తెలిపారు. వారందరికీ డబ్బులు తిరిగి ఇవ్వడంతో పాటుగా.. డిశంబర్ నెలలో టిడ్కో ఇళ్లను సకల మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.
అమ్మఒడి లాంటి పథకాలను తామెందుకు అమలు చేయలేకపోయారో ఆలోచన చేయవలసింది పోయి.. అటువంటి మంచి కార్యక్రమాలపై ఎల్లో మీడియా సాయంతో బురద చల్లడం సరికాదని మల్లాది విష్ణు అన్నారు. దీనిపై ఇప్పటికే ఆ శాఖ మంత్రి పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులకు లంచాలు ఇచ్చుకోలేక ఎస్.టి.వి.ఆర్. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను ఆపేసి కాంట్రాక్టర్లు పారిపోయారని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో 20 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 3.34 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 163 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 31 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పేరంట్స్ కమిటీ, ఇంజనీరింగ్ డిపార్మెంట్ల సమన్వయంతో పనులు త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 7 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరారంటే ఆ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. అంతేకాకుండా మండలానికో మహిళ కాలేజీని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మహిళ కళాశాల రాబోతున్నట్లు తెలిపారు. గతంలో 2009-14 మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పాయకాపురంలో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసినట్లు మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఇవాళ ఆ కళాశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నట్లు వివరించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో సెంట్రల్ నియోజకవర్గంలో సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పినట్లు మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 27వ డివిజన్ కు సంబంధించి 960 మందికి వైఎస్సార్ ఆసరా, 842 మందికి పింఛన్, 1,145 మందికి ఇళ్ల పట్టాలు, 149 మందికి జగనన్న తోడు, 133 మందికి సున్నావడ్డీ, 414 మందికి వైఎస్సార్ చేయూత, 389 మందికి అమ్మఒడి, 252 మంది విద్యాదీవెన పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. అలాగే 28వ డివిజన్లో 750 మందికి వైఎస్సార్ ఆసరా, 782 మందికి పింఛన్, 61 మందికి జగనన్న తోడు, 101 మందికి సున్నావడ్డీ, 217 మందికి వైఎస్సార్ చేయూత, 752 మందికి అమ్మఒడి, 244 మంది విద్యాదీవెన పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు వివరించారు. 29వ డివిజన్ కు సంబంధించి 1,518 మందికి ఇళ్ల పట్టాలు, 1,390 మందికి వైఎస్సార్ ఆసరా, 805 మందికి పింఛన్, 66 మందికి జగనన్న తోడు, 238 మందికి సున్నావడ్డీ, 309 మందికి వైఎస్సార్ చేయూత, 1,470 మందికి అమ్మఒడి, 319 మంది విద్యాదీవెన వర్తించినట్లు పేర్కొన్నారు. కేవలం మూడేళ్లలోనే లక్షా 70 వేల మంది లబ్ధిదారులకు రూ. 113 కోట్ల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందించిందని.. ఇంత పెద్దఎత్తున సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారో గత తెలుగుదేశం పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రజలు లబ్ధి పొందిన వివరాలన్నింటినీ బుక్ లెట్ల రూపంలో పొందుపరిచి మే నెల నుంచి గడప గడపకు వెళ్లి అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు వాలంటీర్లందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వాలంటీర్ల సేవలను గుర్తించి వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గతేడాది రూ. 270 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది రూ. 240 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 96 వార్డు సచివాలయాలు ఉండగా 1,401 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. వీరిలో 1,249 మంది సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు వెల్లడించారు. 27వ డివిజన్ కు సంబంధించి 46 మందికి సేవామిత్ర అవార్డుకు ఎంపిక కాగా.. 28వ డివిజన్ కు సంబంధించి 42 మంది సేవామిత్ర, ఒకరు సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు. 29వ డివిజన్ కు సంబంధించి 45 మంది సేవామిత్ర, ఒకరిని సేవారత్న అవార్డు వరించినట్లు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత అంకిత భావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే కార్పొరేటర్లు సైతం ఎప్పటికప్పుడు వార్డు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు వేదాంతం చైతన్య, బొప్పన గాంధీ, దయానంద్, జోనల్ కమిషనర్ రాజు, సి.డి.ఓ. జగదీశ్వరి(నిర్వాహకులు), సచివాలయాల సెక్రటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News