Breaking News

గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సామూహిక ఉపనయనాలు

-పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో గాయత్రీ సొసైటీ పాత్ర అభినందనీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా త్రికాల సంధ్యా దేవతలతో కూడిన గాయత్రీ మాత చిత్రపటం ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యనారాయణపురంలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గార్ల సమక్షంలో వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 09: 11 నిమిషాలకు ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యుక్త మిధునలగ్నం నందు 50 మంది వటువులకు యజ్ఞోపవీత ధారణ గావించి ఉపనయన తంతును ముగించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు నేతృత్వం వహించగా.. శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీశ్రీశీ గంభీరనంద భారతీస్వామి, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ నరసింహానంద భారతీస్వామి విచ్చేసి వటువులకు దివ్య ఆశీస్సులు అందజేశారు. భిక్షాటన, యజ్ఞోపవీతం ధరించిన అనంతరం ఆచరించవలసిన నియమాలపై ముఖ్య అతిథులు వటువులకు వివరించారు.

బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి దశాబ్ధకాలంగా గాయత్రీ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. మరీముఖ్యంగా కరోనా కష్టకాలంలో పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో సొసైటీ పాత్ర మరువరానిదన్నారు. సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఏటా సామూహిక ఉప‌న‌య‌న‌ మ‌హోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ఎన్నో రోజుల నుంచి కార్యక్రమ నిర్వహణకై కార్యాచ‌ర‌ణ రూపొందించి అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేయ‌డం ప‌ట్ల నిర్వాహ‌కుల‌కు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిఒక్క వటువు త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్రోపాసనం తప్పనిసరిగా ఆచరించాలన్నారు. అప్పుడే వారి జీవన స్థితిగతులు ఉన్నత స్థాయికి చేరుకుంటాయన్నారు. ఉపనయనాలు పూర్తిచేసుకున్న వటువులు క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించే విధంగా గాయత్రీ సొసైటీ బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. ఇందుకోసం ఒక గురువును ఏర్పాటు చేయడంతో పాటుగా పుస్తక రూపేణా సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. నెల రోజుల తర్వాత ఒక పరీక్షను కూడా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 16 ఏళ్ల వయస్సు లోపే ఉపనయనాలను పూర్తిచేసుకోవలసిందిగా బ్రాహ్మణ బాలురకు సూచించారు. ప్రతిఒక్క బ్రాహ్మణుడు తన దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ త్రికాల సంధ్యావందనాన్ని మరువకూడదని మల్లాది విష్ణు అన్నారు.

శ్రీశ్రీశీ గంభీరనంద భారతీస్వామి వారు మాట్లాడుతూ త్రికాల సంధ్యావందన విశిష్టతను వివరించారు. సంధ్యావందనం సమయంలో సూర్య శక్తిని పొందేందుకు మనషికి ఉన్న శక్తి చాలదు కనుక గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క వటువు క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించే విధంగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.

శ్రీశ్రీశ్రీ నరసింహానంద భారతీస్వామి వారు మాట్లాడుతూ తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన మంత్రం లేదని తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వటువులపై ఉండాలని ఆకాంక్షించారు. బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందిస్తోన్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా త్రికాల సంధ్యా దేవతలతో కూడిన గాయత్రీ మాత చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, గాయత్రీ సొసైటీ చైర్మన్ గంటి ఈశ్వర్, సెక్రటరీ చల్లా హరికుమార్, ట్రెజరర్ జె.కె.సుబ్బారావు, సభ్యులు మారుతి ప్రసన్న, కొప్పరపు బలరామమూర్తి, గాయత్రి సేవాసంఘం చైర్మన్ మందలపర్తి సత్యశ్రీహరి, జనరల్ సెక్రటరీ యల్లాప్రగఢ సుధీర్ బాబు, ట్రెజరర్ కొప్పరపు మారుతి, వటువులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *