-60 వ వార్డు 263వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్కరణల ద్వారా పరిపాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ – 263 వ వార్డు సచివాలయం పరిధి A-బ్లాక్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ప్రజా సమస్యల పరిష్కార దిశగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణ, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,251 గృహాలలో, 600 గడపలను సందర్శించారు. పేరుపేరున ప్రతిఒక్కరినీ పలకరిస్తూ అన్ని శాఖల అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. సమస్య ఎటువంటిది అయినా పార్టీలకతీతంగా స్వీకరిస్తూ.. వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. కాలనీలో త్రాగునీరు రంగు మారకుండా.. ప్రతీరోజు పరీక్షలు చేయాలని ఈ సంద్భరంగా సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. సైడ్ కాల్వలలో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలన్నారు. గంజాయి బ్యాచ్, ఆకతాయిల మితిమిరిన ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో హౌసింగ్ పై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించవలసిందిగా సచివాలయ సిబ్బందికి సూచించారు. రెండు రోజుల్లో టిడ్కో లబ్ధిదారులకు వారివారి వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని.. దీంతో పాటు డిసెంబర్ నాటికి సామూహిక గృహ ప్రవేశాలు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మంజూరైన 28 వేల ఇళ్ల పట్టాలకు సంబంధించి తొలిదశలో 14 వేల ఇళ్ల నిర్మిస్తున్నట్లు వివరించారు. డివిజన్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ కు సంబంధించి నిర్వహించిన మేళా ద్వారా సుమారు 2,800 మంది లబ్ధిదారులను గుర్తించామని, జీవో వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అలాగే రూ. 2 కోట్ల నిధులతో కాలనీలో తారురోడ్లకు మరమ్మతులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వాంబేకాలనీ జి బ్లాక్ ప్రారంభం నుంచి చివరి వరకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
263వ వార్డు సచివాలయ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 1.53 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 383 మందికి ప్రతినెలా రూ. 9.77 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 575 మందికి రూ. 80.50 లక్షలు., విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా 75 మందికి రూ. 16 లక్షలు., వైఎస్సార్ ఆసరా ద్వారా 280 మందికి రూ. 14 లక్షలు., జగనన్న తోడు ద్వారా 28 మందికి రూ.2.80 లక్షలు., చేయూత ద్వారా 72 మందికి రూ. 13.50 లక్షలు., వాహనమిత్ర ద్వారా 54 మందికి రూ. 5.40 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.55 కోట్ల సంక్షేమాన్ని నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు.
ఎమ్మెల్యే చొరవతో దివ్యాంగురాలికి 3 చక్రాల బండి అందజేత
వాంబే కాలనీ ‘E’ బ్లాక్ కు చెందిన మేకపోతుల శివపార్వతి (40) అనే మహిళ అంగవైకల్యంతో బాధపడుతోంది. తన జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు 3 చక్రాల బండి కొందామంటే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతోంది. మహిళ దయనీయ స్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. వెనువెంటనే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి 3 చక్రాల బండిని మంజూరు చేయించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం ట్రై సైకిల్ ను దివ్యాంగురాలికి అందజేశారు. విషయం తెలిపిన వెంటనే స్పందించి సాయం అందించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి మహిళ, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రజాపయోగ కార్యక్రమం చేపట్టినా, కోర్టులను ఆశ్రయించి ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాలపై నిత్యం కేసులు వేస్తూ.. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్షం కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టినప్పుడే అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చగలుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే నిత్యావసరాల ధరలపై తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా త్రిప్పికొడతామన్నారు. గత పాలకులు బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించి.. సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి ప్రజల నడ్డి విరిచారన్నారు. కానీ ఈ ప్రభుత్వం అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. అమరావతి అనే భ్రమలో పడి.. చంద్రబాబు అన్ని రంగాలను కుదేలు చేశారని మల్లాది విష్ణు విమర్శించారు. పార్టీ లేదు, బొ.. లేదు అని చెప్పిన అచ్చెన్నాయుడు.. టీడీపీకి 160 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ గురునాథం, ఏ.ఎం.ఓ.హెచ్. రామకోటేశ్వరరావు, ఏఈ(ఎలక్ట్రికల్) అనిల్, ఏఈ(వాటర్) అరుణ్, శానిటరీ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ, 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మోదుగుల గణేష్, బత్తుల దుర్గారావు, ఇస్మాయిల్, బాబు, కిరణ్, కుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News