-57 వ డివిజన్ 236 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని స్టేట్ ఆఫ్ టెర్రర్ గా మార్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57 వ డివిజన్ – 236 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గురువారం ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్, పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,447 గృహాలలో, 700 గడపలను సందర్శించి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏ ఇంట్లో ఏఏ పథకాల ద్వారా ఎంత మేరకు లబ్ధి చేకూరిందో తెలియజెప్పారు. అర్హత ఉండి ఇంకా వర్తించని పథకాలు ఏమైనా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, దోమలపై ఫిర్యాదులు అందడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. వీధులలో మందుబాబులు, ఆకతాయిలు సంచరించకుండా గస్తీ పెంచాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశంపై ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం తెలిపి.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. 3-4 నెలల్లో రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నా.. కనిపించడం లేదని టీడీపీ నేతలు చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా వర్షాకాలంలో ప్రజలు న్యూరాజరాజేశ్వరి పేటలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా వంతెనను మంజూరు చేయించి పనులు పూర్తి చేయడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. మరలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 236 వ సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు గానూ తాజాగా రూ. కోటి 38 లక్షల నిధులు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో సీతారాంపురం కాలనీ రోడ్డు నిర్మాణానికి రూ. కోటి., రోడ్లు, డ్రెయిన్ల మరమ్మతుకు రూ. 20 లక్షలు., కుమార్ టీస్టాల్ ప్రాంతంలో పైపు లైన్లు మార్చేందుకు రూ. 18 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
వీటితో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. కోటి 43 లక్షల 48 వేల 501 రూపాయల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు మల్లాది విష్ణు చెప్పారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 384 మందికి ప్రతినెలా రూ. 9.98 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 467 మందికి రూ. 70.05 లక్షలు., విద్యాదీవెన ద్వారా 71 మందికి రూ. 3.59 లక్షలు., వైఎస్సార్ ఆసరా ద్వారా 190 మందికి రూ. 14.54 లక్షలు., చేయూత ద్వారా 166 మందికి రూ. 21.75 లక్షలు., వాహనమిత్ర ద్వారా 62 మందికి రూ. 6.20 లక్షలు., కాపు నేస్తం ద్వారా 19 మందికి రూ. 2.85 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 22 మందికి రూ.3.30 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.28 కోట్ల సంక్షేమాన్ని నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందామని సచివాలయ సిబ్బంది చెప్పక ముందే ప్రజలు తమ ముందుకు వచ్చి పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మల్లాది విష్ణు తెలిపారు.
అమలాపురం అరాచకానికి చంద్రబాబు, పవన్, సోమువీర్రాజులే బాధ్యులు
అనంతరం మీడియాతో మాట్లాడారు. మహనీయుల నామకరణాలతో జిల్లాలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో.. అంబేద్కర్ జిల్లాపై ప్రతిపక్షాలు దుర్మార్గపు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కోనసీమ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. కానీ కొన్ని దుష్టశక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయన్నారు. పైకి అంబేద్కర్ పేరు పెట్టాలని చెబుతూ.. వెనుక చంద్రబాబు, పవన్ లు కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పక్కా పథకం ప్రకారమే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని దుయ్యబట్టారు. మరోవైపు సామాజిక న్యాయ భేరీ పేరిట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 28న విజయవాడ నగరంలో ప్రవేశిస్తుందని మల్లాది విష్ణు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఈ యాత్రలో పెద్దఎత్తున పాల్గొని తమ ఆనందాన్ని పంచుకునే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్ నుంచి సంక్షేమం వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. కావున నగర ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో బస్సు యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, ఏఈ(ఎలక్ట్రికల్) అనిల్, ఏఎంహెచ్ఓ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ళ ఆదినారాయణ, నాయకులు భోగాది మురళి, పఠాన్ నజీర్ ఖాన్, నెళ్లి గోవింద్, చెన్నకేశవరెడ్డి, బాల, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News