Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా షటిల్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం…

-క్రీడలతో మానసిక ఉల్లాసం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ స్టేడియం నందు మల్లాది వేంకట సుబ్బారావు స్మారకార్థం నిర్వహించిన నగర స్థాయి షటిల్ టోర్నీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, వీఎంసీ స్పోర్ట్స్ & ట్రాఫిక్ కమిటీ చైర్మన్ పెనుమత్స శిరీష సత్యంలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు, కాసేపు షటిల్ ఆడి వారిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బడ్జెట్ లో క్రీడా రంగానికి చేసిన కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు. క్రీడల ద్వారా యువత అనేక ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలలో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. జీవో నెం. 74 ని కూడా తీసుకురావడం జరిగిందన్నారు. దీని ద్వారా 2019-20, 2020-21 సంవత్సరాలలో 2,500 మంది పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగావకాశాలు పొందినట్లు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని.. నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో యువత రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని తెలిపారు.

విజయవాడ అంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లు అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అభివర్ణించారు. వారి స్ఫూర్తితో యువత క్రీడలలో విజయాలు సాధించాలన్నారు. క్రీడాకారులకు కావలసిన సదుపాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ సహకారంతో సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగపరచుకొని క్రీడాకారులు అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని అన్నారు. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటమిలను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. అనంతరం విజేతలుగా నిలిచిన క్రీడాకారులు కె. రాజారత్నం, రాంబాబులకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, నిర్వాహకులు కె.రాజారత్నం, పల్లపు ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *