-59వ డివిజన్ 235 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం 59 వ డివిజన్ – 235 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి మూడోరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎక్సెల్ జి బ్లాక్, రామ్ నగర్ అపార్ట్ మెంట్లలో విస్తృతంగా పర్యటించి.. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. సుమారు 352 గడపలను సందర్శించి.. ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జీ బ్లాక్ వద్ద ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే మరో మూడు పంపులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే అపార్ట్ మెంట్ల పరిసర ప్రాంతాలలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చుమీరకుండా గట్టి నిఘా పెంచాలని పోలీస్ అధికారులకు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాటల రూపంలో కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30వేల మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షలు విలువ చేసే ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఈ ప్రభుత్వం కేటాయించిందని మల్లాది విష్ణు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ. 270 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రజలు 80 శాతం సంతృప్తిగా ఉన్నట్లు వివరించారు. కానీ పచ్చ మీడియాలో కనిపించాలనే దుగ్దతో తెలుగుదేశం నాయకులు దొంగ ధర్నాలు చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు.
మైనార్టీలపై చంద్రబాబుది కపట ప్రేమ
మైనార్టీలపై చంద్రబాబుది కపట ప్రేమ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముస్లింలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదన్నారు. కనీసం మంత్రివర్గంలో స్థానం కల్పించడకుండా.. నాలుగున్నరేళ్లు ముస్లింలను దూరం పెట్టి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే.. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దుల్హన్ పథకంలోనూ పెద్దమొత్తంలో బకాయిలు పెట్టి మైనార్టీలను వంచించారన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. వారి సంక్షేమానికి ఏటా భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని మైనార్టీ వర్గాల నుంచి ఈ ప్రభుత్వం ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఉర్దూను రాష్ట్ర రెండో అధికార భాష హోదా కల్పించడంతో పాటు.. రాజకీయంగా ముస్లింలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గూర్చి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మల్లాది విష్ణు అన్నారు. పోలవరం అంటే ఎప్పటికైనా గుర్తొచ్చేది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ మహానేత హయాంలోనే 75 శాతం భూసేకరణ జరిగిందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని.. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రస్తావించారని గుర్తుచేశారు. కేవలం బాబు భజనకే రూ.100 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టును కమీషన్ల కోసం టేక్ ఓవర్ చేసి.. ఇష్టానుసారంగా వందిమాగదుల కంపెనీలకు నిధులను దోచిపెట్టారన్నారు. అలాగే పట్టిసీమ ప్రాజెక్టులో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కాగ్ నివేదిక చెప్పిందన్నారు. తెలుగుదేశం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోందని మల్లాది విష్ణు అన్నారు. రివర్స్ టెండరింగ్ తో ఇప్పటికే రూ. వేల కోట్ల నిధులను ఆదా చేసినట్లు వివరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కలల స్వప్నం పోలవరం ప్రాజెక్టు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు హఫీజుల్లా, హనీఫ్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, భోగాది మురళి, నందెపు సురేష్, నేరెళ్ల శివ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News