-జంతు ప్రేమికులు విధిగా వారు పెంచుతున్న కుక్కల వివరాలు నమోదు చేయించుకోవాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ మరియు జీవకారుణ్య ఆశ్రమం వార్ల సంయుక్త ఆద్వర్యంలో 43వ డివిజన్ పరిధిలోని భవానీపురం ఐరన్ యార్డ్ జీవకారుణ్య ఆశ్రమం నందు ఏర్పాటుచేసిన ఉచిత రేబిస్ టీకా వేయు కార్యక్రమమును కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ బి.కోటిరెడ్డి తో కలసి ప్రారభించారు. ఈ సందర్బంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నగర పరిధిలోని పెంపుడు మరియు వీధి కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకా వేయు కార్యక్రమము నిర్వహించుట జరుగుతుందని కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి కుక్కకు రేబిస్ టీకా వేయించుకొనునట్లుగా చూడాలని అన్నారు. నగరపాలక సంస్థ తరుపున లేదా ప్రైవేటుగానైనా తప్పని సరిగా పెంపుడు లేదా వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయుట ఎంతో అవసరం అని, రేబిస్ వ్యాధి సోకకుండా ఉపయోగకరంగా ఉండునని వ్యాధి వచ్చాక కంటే ముందుగానే వ్యాధి సోకకుండా తగిన వ్యాక్సినేషన్ వేయుట ముఖ్యమని ఈ దిశగా జంతు ప్రేమికులు భాద్యతగా తమ కుక్కలకు టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ సందర్బంలో మున్సిపల్ కార్పోరేషన్ యాక్ట్ ప్రకారం నగర పరిధిలో ప్రతి ఒక్కరు తమ తమ నివాసాలలో గల పెంపుడు కుక్కల మరియు వీధి కుక్కల వివరాలు నగరపాలక సంస్థ కార్యాలయo లేదా దగ్గరలో ఉన్న సచివాలయాలలో నమోదు చేయించుకోవలసిన అవసరం ఉందని, దీని ద్వారా నగరంలో ఎన్ని కుక్కలు ఉన్నవి, ఎన్నింటికి వ్యాక్సిన్ లేదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించినది వంటి వివరాలు అందుబాటులో ఉండుట ఎంతో దోహద పడుతుందని అన్నారు. అదే విధంగా జీవకారుణ్య ఆశ్రమం వారు నగర పరిధిలోని వీధి కుక్కలకు అందిస్తున్న వైద్య సేవలు మరియు వాటిని సంరక్షణ కొరకు చేస్తున్న ఏర్పాట్లుపై యాజమాన్యాన్ని అభినందించారు. నేటి ఈ కార్యక్రమము ద్వారా జీవకారుణ్య ఆశ్రమం మరియు కొత్తపేట నెహ్రు బొమ్మ సెంటర్ నందు 450 కుక్కలకు టీకాలు వేయటం జరిగిందని, రేపు కూడా టీకా వేయుటం జరుగుతుందని మిగిలిన వారు తప్పక మీ కుక్కలకు టీకాలు వేయించుకోనవలేనని వి.ఏ.ఎస్ డా.రవి చంద్ పేర్కొన్నారు. పై కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి,హెచ్ బాబు శ్రీనివాసన్, వి.ఏ.ఎస్ డా.ఎ.రవిచంద్, హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సేన్, మరియు జీవకారుణ్య ఆశ్రమం ప్రతినిధి యం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News