-రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి..
-కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇళ్లు తొలగించిన నిర్వాసితులకు గృహాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ సమీపంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనుల ప్రగతి, నిర్వాసితులకు గృహాల మంజూరుపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ 2019లో సంభవించిన వరదల వలన ముంపుకు గురి అయిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి ముంపును నివారించేందుకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 1.5 కిలో మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన 125 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులను నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. రానున్న ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షాలు సంభవించి కృష్ణానదీకి 8 లక్షల వరకు వరద నీరు చేరినప్పటికి పరివాహక ప్రాంతాల వారు ఎటువంటి వరద నీటి ముంపుకు గురి కాకుండా ఈ రిటైనింగ్ వాల్ రక్షణగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో 524 ఇళ్లకు సంబంధించిన గృహాలను తొలగించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇల్లు తొలగించిన వారికి వాంబే కాలనీలో గృహాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గోడ నిర్మాణ ఎలైన్‌మెంట్‌లో మరో 187 ఇళ్లను తొలగించవలసివుందని ఇందులో 98 గృహాలను తొలగించేందుకు జాబితాను రూపొందించి యజమానులను గుర్తించడం జరిగిందన్నారు. గతంలో తొలగించిన ఇళ్లకు సంబంధించి మరో 89 మందికి చెందిన గృహాలను తొలగించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన నివాసితులు గృహాలు మంజూరు చేయాలని ఆర్జీలు పెట్టుకున్నారన్నారు. సంబంధిత గృహ నివాసితుల ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డ్‌లను గతంలో కరకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న చిరునామాను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, నీటిపారుదల శాఖ కెసి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. కృష్ణారావు, ఏఇ ప్రభుతేజ, డిప్యూటి సీటీ ప్లానర్ జూబెన్, తహాశీల్థార్లు వి. శ్రీనివాసరావు, వెంకట్రామయ్య ఉన్నారు.
Prajavartha Online Telugu News