విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతీ చిరువ్యాపారికి జగనన్న తోడును అందించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జగనన్న తోడు పథక లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరుపై జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి డిఆర్‌డిఏ, మున్సిపల్ కమీషనర్లు, యంపిడివోలు, తహాశీల్థార్లు, సంబంధిత అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వారికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఫుట్‌పాత్‌లు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులకు రోడ్లపక్క టీఫీన్ సెంటర్లు నిర్వహించేవారికి, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై ఇంటింటికి తిరిగి అమ్మకాలు నిర్వహించే వారికి సాంప్రదాయ చేతి వృత్తులు చేసుకుని జీవనం కొనసాగించే వారికి, రోజూ వారి పెట్టుబడి కోసం ప్రతి ఎటా ఒకొక్కరికి 10 వేల రూపాయలు వడ్డీలేని రుణాలను అందించే జగనన్న తోడు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో చిరువ్యాపారస్తులను గుర్తించి ప్రతి ఒక్కరికి జగనన్న తోడు పథకాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మూడవ విడతలో రెన్యువల్, కొత్తగా వచ్చిన 15,922 మంది లబ్దిదారులు వివిధ బ్యాంకుల ద్వారా ధరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వీరిలో 11,972 మందికి బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయగా, కేవలం 197 మందికి మాత్రమే రుణాల మంజూరు అంగీకారం తెలపడం జరిగిందన్నారు. నాల్గవ విడతలో 2,166 మంది లబ్దిదారులు ధరఖాస్తులు చేసుకోగా, 1094 మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరిలో 147 మందికి రుణాలు అందించడం జరిగిందని మరో 471 మందికి రుణాలు అందించేందుకు బ్యాంకు అధికారులు సిద్దంగా ఉన్నారన్నారు. రుణాలు మంజూరు చేసిన ప్రతి లబ్దిదారునికి వెంటనే బ్యాంకుల నుండి రుణాల సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న తోడు పథకానికి సంబంధించిన అధికారులు ప్రతి మండలంలోను బ్యాంకు అధికారులతో సమవేశమై లబ్దిదారులకు బ్యాంకుల నుండి రుణాల మంజూరులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి రుణ సహాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో రుణాలు మంజూరై నేటికి పొందని లబ్దిదారులకు సకాలంలో రుణాలు పొందేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
Prajavartha Online Telugu News