-26వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు వేసిన కేసుల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణాలలో తీవ్ర జాప్యం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 26 వ డివిజన్ 31 వ వార్డు సచివాలయం పరిధిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 960 గృహాలలో, 280 గడపలను సందర్శించారు. బుల్లెమ్మ వారి వీధి నుంచి ప్రారంభమై కాటూరి వారి వీధి, అక్కల తాతయ్య వీధుల వరకు పర్యటించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ఎమ్మెల్యే సహా నాయకులు, అధికారులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన సమస్యల్ని పరిష్కరించేందుకు అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం వారికి మరింత సంతృప్తినిచ్చింది. శాచ్యురేషన్ పద్ధతిలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై 80 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మల్లాది విష్ణు అన్నారు. మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఇటీవల జరిగిన ప్లీనరీ వేదికగా వివరించడంతో పాటు.. రానున్న రెండేళ్ల కార్యాచరణను కూడా ప్రజల ముందు ఉంచడం జరిగిందని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి స్థలం మంజూరు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30వేల మంది నిరుపేదలకు రూ. 320 కోట్లతో భూమి కొని పట్టాల రూపంలో ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షలు విలువ చేసే ఆస్తిని సమకూర్చామన్నారు. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు కోర్టులలో వేసిన పిల్స్ కారణంగా 10 వేల మంది పేదలకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. వీరందరికీ నగర సమీపంలో ఇళ్ల పట్టాలు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థలాన్వేషణలో ఉన్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించడం శుభపరిణామమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అదే గత తెలుగుదేశం హయాంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని.. తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా భ్రమరావతి చుట్టూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడానికే పరిమితమైందన్నారు. మైనింగ్ గూర్చి మాట్లాడే ముందు తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని ఎందుకు దాడి చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఇసుక ద్వారానే ఐదేళ్లలో టీడీపీ నాయకుల అక్రమార్జన దాదాపు రూ.12,500 కోట్లకు చేరిందని విమర్శించారు. గోదావరి, కృష్ణా, పెన్నా.. ఇలా నదులతో పాటు చివరకు వాగుల్లో దొరికే ఇసుకను సైతం వదలకుండా దోచేశారని పేర్కొన్నారు. మీ అక్రమాలను ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో బాధితులను పోలీస్ స్టేషన్ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించి చంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కనుక చంద్రబాబు ఇకనైనా గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డివిజన్ కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, నాయకులు చలసాని వెంకటేశ్వరరావు, భోగాది మురళి, శంకర్, పసుపులేటి కోటేశ్వరరావు, పారా ప్రసాద్, బాడిత వెంకట్రావు, రమణ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News