Breaking News

ప్రతి ఒక్క పథకం చరిత్రలో నిలిచిపోయేలా పాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 200 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడేళ్ల పాలనలో ప్రతి ఒక్క పథకం చరిత్రలో నిలిచిపోయేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 27 వ డివిజన్ 200 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గులాబీతోటలోని పున్నయ్యకాలనీ, పసుపులేటి వారి వీధి, బాలాజీ వీధి, ఆళ్ల సత్యనారాయణ వీధులలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వార్డు సచివాలయ పరిధిలోని 1,026 గృహాలలో, 290 గడపలను సందర్శించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉండగా రచ్చబండ కార్యక్రమంతో మూడు నెలలకోసారి అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి జవాబుదారీతనం పెంచారని గుర్తుచేశారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కలలు కన్న స్థానిక సుపరిపాలనను సచివాలయ వ్యవస్థ రూపంలో సాకారం చేసి చూపారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా తమ ఇంటికి వచ్చి చిరునవ్వుతో పలకరిస్తుండటంతో ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. అడుగడుగునా హారతులు పట్టి ప్రజాప్రతినిధులకు ఆత్మీయ స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకునితో సెల్ఫీ దిగేందుకు యువకులు పోటీ పట్టారు. దేశంలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మల్లాది విష్ణు తెలిపారు. అందుకు కాపునేస్తం పథకమే ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో మూడో విడత కాపు నేస్తంకు సంబంధించి 2,042 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 30 వేల నిధులు జమ చేసినట్లు తెలిపారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తిచేసుకున్న సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ద్వారా ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని.. త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలియజేశారు.

గుడ్ గవర్నెన్స్ కు కేంద్ర బిందువుగా సచివాలయ వ్యవస్థ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకంలో సచివాలయం వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా, రాష్ట్రానికే గర్వకారణంగా మారిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్‌ ఖరారు అనంతరం ఈ నెల నుంచి కొత్త పీఆర్సీ పేస్కేలు అమలులోకి రావడంతో వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ యంత్రాంగం, సచివాలయ వ్యవస్థ రెండు కళ్లుగా రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇంత పెద్దఎత్తున విజయవంతం కావడంలో సచివాలయాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలలో సంతృప్తి స్థాయి గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. కనుకనే దేశంలోని అనేక రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారని.. ప్రధాని సహా మన రాష్ట్రంలో పర్యటించిన పలువురు కేంద్ర మంత్రులు సైతం వ్యవస్థను కీర్తించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ముందుకు సాగుదామని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బాబును ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు భావించడం లేదు
వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. ఉచిత సలహాలు మానుకోవాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతకు సూచించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మాకు సవాలు విసిరే బదులు టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అదే 2018లో వైఎస్సార్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి ఆమోదించుకున్నారని గుర్తుచేశారు. కానీ ప్రతీసారి రాజీనామాలకు రెడీ అనడమే తప్ప.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేది లేదని ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చంద్రబాబుకు బాగా తెలుసని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలతోనే అది స్పష్టమైందని తెలియజేశారు. మరోవైపు వరద బాధితుల పునరావాసం గూర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. కనుక ప్రతిపక్షాలు వరదల పేరిట చేస్తున్న బురద రాజకీయాలను మానుకోవాలని.. లేకుంటే ప్రజలు అసహ్యించుకుంటారని హితవు పలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, నాయకులు కురిటి శివ, బొప్పన గాంధీ, పిల్లుట్ల వంశీ, మండా రాము, శనగశెట్టి హరిబాబు, పసుపులేటి బుచ్చిబాబు, యర్రంశెట్టి శ్రీను, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు: కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *