విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
కిడ్నీ వ్యాధి నివారణకు మూలలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా. కుంభా రవి బాబు, కమిటీ సబ్యులకు వివరించారు.
ఏ. కొండూరు మండలం లోని చీమలపాడు తండా, మాన్సింగ్ తండా, మాంత్రీయ తండా, ఏ.కొండూరు గిరిజన తండాలలో గురువారం ఉదయం రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా. కుంభా రవి బాబు, కమిటీ సబ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏ. కొండూరు మండలం గిరిజన తండాలలో కిడ్నీ వ్యాధి తో బాధ పడుతున్న గిరిజన కుటుంబ సభ్యులతో ముఖా ముఖి నిర్వహించి గిరిజనులకు అందుతున్న వైద్య సదుపాయాలు, కిడ్నీ డయాలసిస్ పై వారు ఎదుర్కుంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నానని వివరించారు. గిరిజనులు, గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించానని వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని చైర్మన్ కుంభా రవిబాబు కలెక్టర్ కు వివరించారు. గిరిజన తండాలలో డయాలసిస్ రోగులకు అంబులెన్సు సౌకర్యం కల్పించాలని, తండాలలో డయాలసిస్ రోగులకు అందించే పెన్షన్ మంజూరు అర్హతలో వెసులుబాటు కల్పించాలని, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న లబ్దిదారులకు డయాలసిస్ రోగులకు ఇచ్చే రూ. 10 వేల రూపాయలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను సరిచేయాలని కోరారని చైర్మన్ కలెక్టర్ కు వివరించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ జిల్లాలోని ఏ. కొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం మండలాల్లోని గిరిజన తండాలలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు కిడ్నీ వ్యాధికి గురికాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. తండాలలోని గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తామన్నారు. ఏ. కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, తదితర గిరిజన తండాలలోని ప్రజలకు సురక్షిత త్రాగునీటిని రక్షిత మంచినీటి పధకాల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా మైలవరం నుండి ఏ. కొండూరు వరకు పైప్ లైన్ పొడిగించి రూ. 38 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే ప్రతిపాదనలను ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. తాత్కాలికంగా టాంకర్ ల ద్వారా అన్ని తండాలకు రక్షిత త్రాగునీటిని సరఫరా చేసేలా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశిస్తామని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో తిరువూరు ఆర్ డి ఓ వై.వి. ప్రసన్న లక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం. రుక్మాoగదయ్య, కమిటీ సభ్యులు, గిరిజన నాయకులు ఉన్నారు.
Prajavartha Online Telugu News