విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ లబ్ది చేకూర్చాలని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత సహాయ మంత్రి ఏ. నారాయణ స్వామి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, కేంద్రంచే అందించ బడుతున్న పధకాలపై గురువారం కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి పోషణ అభియాన్, మాతృ వందన యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జల జీవన్ మిషన్, ప్రధాన మంత్రి స్వనిది, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ముద్ర యోజన, తదితర పధకాల అమలు, జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర సహాయ మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను ప్రతి లబ్ధిదారునికి అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కోట్లాది రూపాయలు నిధులను కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు వెచ్చిస్తున్నామని, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వర్గాలకు పధకాల లబ్ది చేకూర్చాలన్నారు. దీనివలన సమాజంలో సాధికారిత నెలకొంటుందన్నారు. పేద, ధనికుల తారతమ్యాలు రూపుమాపడానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వందశాతం చేకూర్చాలని మంత్రి అన్నారు. అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రభుత్వ పధకాల పాలసీలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గ్రామీణ్ లో భాగంగా జిల్లా, నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల పరిధిలో చేపడుతున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఫేజ్ -1 లో చేపట్టిన గృహాలను 2023 డిశంబర్ నాటికి లబ్దిదారులకు అందించాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన రుణాలు మంజూరుకు బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా, అర్బన్ రూరల్ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ వాటా లక్షా 50 వేల రూపాయలతో పాటు 30 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగాను, ఈ నిధికి అదనంగా పట్టణ ప్రాంతాలలో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని గ్రూప్ సబ్యులకు రూ. 35 వేల రూపాయలు అదనంగా రుణాన్ని మంజూరు చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ లో 83633 గృహాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 71817 గృహాలు, గ్రామీణ్ లో 5156 గృహాలు మంజూరు కాగా 682 గృహాలు నిర్మాణం ప్రారంభించడం జరిగి ప్రగతిలో ఉన్నాయని చెప్పారు.
పి ఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పధకం పై మంత్రి సమీక్షిస్తూ రైతులకు ఆర్ధిక ప్రయోజనాలను కల్పించే ఈ పధకాన్ని 2019-20 వ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఈ పథకం ద్వారా రూ. 6 వేల రూపాయలు ప్రతీ రైతుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నాదని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకూ లబ్ది చేకూర్చాలని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. రైతు భరోసా పధకంలో ఎస్.టి., ఎస్.సి., మైనారిటీ, బి.సి. వర్గాల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13500 రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నదన్నారు. ఈ పధకం ద్వారా ఇప్పటివరకూ జిల్లాలో 245 కోట్ల రూపాయలు మేరకు లబ్ది చేకూర్చమన్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం పై కేంద్ర సహాయ మంత్రి సమీక్షిస్తూ జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న నిరుపేదల కుటుంబాలకు 5 కోట్ల ఎల్. పి. జి. కనెక్షన్ లు మంజూరు చేసారని,, దీనికి గాను ఒక్కొక్క కుటుంబానికి రూ. 1600 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ పధకాన్ని జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టి షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన లబ్దిదారులకు వర్తింప చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ 2016 జూన్ నెల లోనే రాష్ట్రం లోనే ఎన్ టి ఆర్ జిల్లాను కిరోసిన్ ఫ్రీ జిల్లాగా ప్రకటించడం జరిగిందని వివరించారు.
పోషణ అభియాన్ పై సమీక్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టిక ఆహారాన్ని అందించే దిశలో వివిధ పధకాల క్రింద లబ్ది చేకూరుస్తున్నప్పటికీ రక్త హీనత, ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు, తదితర లోపాలు నమోదు అవుతున్నాయని దీని నివారణకు పధకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ జిల్లాలో 1475 అంగన్ వాడి కేంద్రాల ద్వారా వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ కిట్లు, టేక్ హోమ్ రేషన్ ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, కిశోర బాలికలకు న్యూట్రిషన్ ఫుడ్ సమకూరుస్తున్నామని, ఈ పధకం ద్వారా జిల్లాలో లక్షా 58 వేల 438 మందికి లబ్దికి చేకూరుస్తున్నామన్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ పై మంత్రి సమీక్షిస్తూ జిల్లాలో వ్యక్తిగత టాయిలెట్ లు, కంమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మాట్లాడుతూ 2023 మార్చి 31 నాటికి వ్యక్తిగత టాయిలెట్ లు, కంమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణాలు నూరు శాతం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
జల జీవన్ మిషన్ పై కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి సమీక్షిస్తూ గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు, అంగన్ వాడీలు, హెల్త్ సెంటర్స్ కు ఇంటింటికీ కుళాయి పధకాన్ని 2019 లో ప్రారంభించడం జరిగిందని, 2024 నాటికి పూర్తి చేసే ఈ పధకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 45 శాతంగా ఉన్నదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్రాగు నీటికి అధిక ప్రాధాన్యతనిచ్చి అవసరమైన నిధులను విడుదల చేయడం జరుగుతున్నదన్నారు. జిల్లాలోని ముఖ్యంగా గిరిజన తండాలలో కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలలో శుద్ధి చేసిన త్రాగునీటిని అందించే పథకాలపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్, మల్టీ విలేజ్ స్కీమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ పధకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ గిరిజన తండాలకు త్రాగునీరు అందించేందుకు రూ. 38 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా నదీ జలాలను పైప్ లైన్ ల ద్వారా అందించ నున్నామని చెప్పారు. జిల్లాలో లక్షా 25 వేల 44 గృహాలకు ఇంటింటి కుళాయి పధకం ద్వారా త్రాగునీరు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 14 గ్రామాలలో వంద శాతం ఇంటింటి కుళాయి పధకాన్ని పూర్తి చేశామని చెప్పారు.
వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి స్వనిది పధకం క్రింద ఎక్కువ మంది లబ్దిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పధకం ద్వారా చిరువ్యాపారులకు రూ. 10 వేల రూపాయలు రుణాలను అందింస్తున్నామని ఇప్పటివరకు 8527 మంది చిరువ్యాపారులకు రుణ సహాయం అందించామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం 2018 వ సంవత్సరం నుండి నేషనల్ పోర్టబిలిటీ లో భాగంగా రేషన్ కార్డు దారులకు లబ్ది చేకూరే విధంగా అమలు చేస్తున్న వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంపై పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించాలని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పధకాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నమోదు అయ్యిందన్నారు. జిల్లాలో ఈ పధకం ద్వారా 235 కుటుంబాలకు లబ్ది చేకూర్చామని కలెక్టర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పధకం ద్వారా నిరుపేదలైన రోగులకు కార్పొరేట్ స్థాయి అన్ని రకాల వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పధకం ద్వారా జిల్లాలో 239 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ మంజూరు అయ్యాయని వీటిలో 63 కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేశామని 168 కేంద్రాలు తుది దశలో ఉన్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల మనోభావాలను అడిగి తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి:-
విజయవాడ రూరల్ నున్న గ్రామానికి చెందిన మహమ్మద్ సుభాని మాట్లాడుతూ నిర్మాణం జరుపుకుంటున్న బేస్ మెంట్ స్థాయిలో ఉన్న తన గృహ నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో 34,600 రూపాయలు ఇప్పటివరకూ అందుకున్నానని, దశల వారీగా నగదు జమ అవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లకు అయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం క్రింద ఇప్పటివరకూ 45 వేల రూపాయలు తన ఖాతాకు జమ అయ్యాయని విజయవాడ రూరల్ రామవరప్పాడుకు చెందిన ప్రసాద రావు అన్నారు.
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం క్రింద లబ్ది పొందుతున్న విజయవాడ నగరానికి చెందిన జి. తులసి మాట్లాడుతూ గతంలో కిరోసిన్ తో వంట చేసుకునేవాళ్లమని ఈ పధకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందామని కరోనా కష్ట కాలంలో 3 గ్యాస్ సిలిండెర్ లు అందించారని ప్రతీ నెలా రూ. 200 రూపాయలు తన బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.
సమావేశంలో నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ నుపుర్ అజయ్, డి.ఆర్.ఓ. కే.మోహన్ కుమార్, సి.పి.ఓ. ఎస్ ఆర్ రత్న రూత్, ఎం హెచ్ ఏ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. వెంకట నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News