-మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలో మలేరియా కేసులు నమోదు అవుతున్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, జిల్లా వైద్యాధికారులు, మలేరియా అధికారులు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్, మున్సిపల్ వైద్యాధికారులు, గ్రామ సెక్రటరీలతో మలేరియా నివారణపై చేపట్టవలసిన చర్యలు ముందస్తు జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జక్కంపూడి గ్రామంలో మలేరియా కేసులు నమోదు అవుతున్నందున అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నివారణకు ప్రత్యేక ప్రణాళికలను సిద్దం చేయాలన్నారు. సాధారణంగా జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం వరకు వర్షాలు కురిసి వీధుల్లో నీళ్లు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభలుతాయని కలెక్టర్ అన్నారు. దోమల నిర్మూలనకు లార్వా పెరగకుండా చర్యలు చేపట్టి ఇంటి కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు చర్యలుగా ఇళ్ల ప్రాంగణాలలో దోమల నివారణ మందులు పిచికారి చేయించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పల్లపు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండే చోట పెరిగే గుర్రపు డెక్కను తొలగించి దోమల మందు పిచికారి చేయాలన్నారు. గర్భణి స్త్రీలు మలేరియా వ్యాధి బారిన పడితే లివర్‌కు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామ స్థాయి సెక్రటరీలు, వైద్య అధికారులు, మలేరియా నివారణ అధికారులు చురుగ్గా పనిచేసి మలేరియా వ్యాధి వ్యాప్తి పై ప్రజలలో అవగాహన కల్పించి చైతన్యవంతులుగా చేసి జిల్లాను పూర్తి మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ మాట్లాడుతూ జక్కంపూడి గ్రామానికి మలేరియా నిర్మూలన కొరకు కార్పొరేషన్ నుండి అదనపు వైద్యాధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టి మలేరియా వ్యాధి పెరగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశంలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన ‘‘మలేరియా వ్యాధి నివారణ మనతో మొదలవుతుంది’’… ‘‘మలేరియా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల’’పై అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. యం. సుహాసిని, జిల్లా మలేరియా అధికారి డా.మోతీబాబు, నగరపాలక సంస్థ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రత్నావలి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం. విజయ భారతి, డిపివో జె. సునీత, కృష్ణాజిల్లా డియంహెచ్‌వో డా.రామారావు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News