Breaking News

సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పిద్దాం


-సెరిబ్రల్ పాల్సీ మానసిక వ్యాధి కాదు..శారీరక రుగ్మత మాత్రమే..
-సరైన చికిత్సలతో సక్రమంగా నడవగలిగే అవకాశం
-ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు
-సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగులకు సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె. దుర్గా నాగరాజు తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే పురస్కరించుకుని గురువారం సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ దుర్గా నాగరాజు మాట్లాడుతూ మెదడులోని కణజాలం దెబ్బతినడం వల్ల సెరిబ్రల్ పాల్సీ సమస్య ఏర్పడవచ్చని అన్నారు. కండరాలు బిగుతుగానూ, వదులుగానూ మారిపోవడం వల్ల సంబంధిత శరీర భాగాలు సక్రమంగా పనిచేయలేవని, మెదడులో దెబ్బతిన్న కణజాలం ఆధారంగా సెరిబ్రల్ పాల్సీ రుగ్మతను మూడు రకాలుగా విభజించారని చెప్పారు. రక్తపరీక్షలు, ఎక్స్-రేల ద్వారా సమస్యను గుర్తించడం సాధ్యం కాదని, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సెరిబ్రల్ పాల్సీని నిర్ధారించవచ్చని అన్నారు. సెరిబ్రల్ పాల్సీ అనేది మానసిక సమస్య కాదని, శారీరక రుగ్మత మాత్రమేనని డాక్టర్ దుర్గా నాగరాజు వివరించారు. ఈ సమస్య కారణంగా పిల్లల ఎదుగుదల ఆలస్యమవుతుందని, కాళ్లు, చేతులకు సంబంధించిన కండరాలు బిగుసుకుపోయి పిల్లలు నడవడలేకపోతారని అన్నారు. రెండేళ్ల వయసు దాటినా పిల్లలు నడవలేకపోతున్నట్లయితే సెరిబ్రల్ పాల్సీ కారణం కావచ్చని, కండరాల సమతుల్యత లోపించిన కారణంగా కాళ్లు, చేతులు వంకరపోవడం, గూని సమస్య తలెత్తడం గుర్తించవచ్చని తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభిస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. దెబ్బతిన్న మెదడు కణజాలాన్ని సరిచేయడం సాధ్యంకాకపోయినప్పటికీ.. ఫిజియోథెరపీ, బొటాక్స్ ఇంజెక్షన్లు, ఆపరేషన్ల ద్వారా సెరిబ్రల్ పాల్సీ సమస్యకు చికిత్స అందించవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల ద్వారా రోగుల జీవన శైలిని మార్చవచ్చని అన్నారు. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చక్కగా ఉపయోగపడుతుందని, కండరాలను సక్రమంగా పనిచేయించడంలోనూ, ఆపరేషన్ తర్వాత రోగి సక్రమంగా నడిచేందుకు ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు బొటాక్స్ ఇంజెక్షన్ సత్ఫలితాలను ఇస్తుందని, బొటాక్ ఇంజెక్షన్ సహాయంతో బిగుసుకుపోయిన కండరాలను సడలింపజేసి సక్రమంగా నడిచేలా చేయవచ్చని వివరించారు. ఒకప్పుడు సెరిబ్రల్ పాల్సీ రోగులకు ఆపరేషన్ చేసేందుకు పదేళ్ల వయసు దాటే వరకూ వేచిచూసేవారని, ఆపరేషన్ తర్వాత రోగి నడిచేందుకు ఒకట్రెండు నెలల సమయం పట్టేదని అన్నారు. బిగుసుకుపోయిన కండరాలకు ఆధునిక పద్ధతుల్లో ఒకే శస్త్రచికిత్స ద్వారా సరిచేసి, మెరుగ్గా నడవగలిగేలా చెయ్యవచ్చని తెలిపారు. ఆపరేషన్ అనంతరం కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రోగి నడవడం ఆరంభించవచ్చని అన్నారు. కండరాల బిగువును బట్టి మూడేళ్ల వయసు దాటిన అనంతరం ఎప్పుడైనా ఆపరేషన్ చేయవచ్చని తెలిపారు. అత్యాధునిక చికిత్సల ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగుల భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దవచ్చని, వారి జీవన స్థితిని మెరుగ్గా మార్చడం మన చేతుల్లోనే ఉందని డాక్టర్ దుర్గానాగరాజు అన్నారు. అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ సెరిబ్రల్ పాల్సీ కారణంగా నడవలేని, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు, కాలు, చేయి వంకర, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలను తిరిగి నడవగలిగేలా చేసేందుకు డాక్టర్ దుర్గా నాగరాజు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వేశ్వరరావు, పీడియాట్రిషియన్ డాక్టర్ శ్వేత, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రమ్య, సెరిబ్రల్ పాల్సీ సమస్యతో బాధపడుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *