-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల చదువుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. న్యూ రాజరాజేశ్వరి పేటలోని దేవినేని వెంకటరమణ ఉన్నత పాఠశాల నందు మంగళవారం జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఆడపిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు, ఉద్యోగాలలో సమాన అవకాశాలే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మహిళలు ఎంతో శక్తి వంతులని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులకు ధీటుగా రాణిస్తున్నట్లు తెలిపారు. చదువులు మొదలుకొని క్రీడల వరకు అన్ని రంగాలలోనూ తమదైన ముద్రను వేస్తున్నారన్నారు. వారు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. మరోవైపు అమ్మఒడి నుంచి విదేశీ విద్య వరకు ప్రతి దశలోనూ విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. ప్రతిఒక్క వార్డు/ గ్రామ సచివాలయాలలోనూ అత్యధికంగా యువతులే సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా కొడుకులతో సమానంగా కూతుళ్లను చదివించి వారి హక్కులను కాపాడాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, నాయకులు కాళ్ల ఆదినారాయణ, చెన్నకేశవరెడ్డి, పఠాన్ నజీర్ ఖాన్, ఉమ్మడి వెంకట్రావు, బెజ్జం రవి, భోగాది మురళి, పాఠశాల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News