-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సుధీర్ఘంగా సాగిన చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్స్ పై సుధీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో ఎక్కడా పవర్ ఓవర్ లోడ్ సమస్య తలెత్తకూడదని సూచించారు. అలాగే అద్దెకు నివసిస్తున్న వారి పేర్ల మీద ఉన్న విద్యుత్ మీటర్లను వీలైనంత త్వరగా డీలింక్ చేసి.. పెన్షన్ దారులకు ఇబ్బందులు గురి కాకుండా చూడాలన్నారు. ఒరిగిన, ఇళ్లల్లోకి ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. మధ్యకట్ట, న్యూ ఆర్ఆర్ పేటలలోని సమస్యాత్మక ప్రదేశాలలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు అమర్చవలసిందిగా ఆదేశించారు. అలాగే విస్తరిస్తున్న కాలనీలలోనూ నూతన పోల్స్ ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అనంతరం సబ్ స్టేషన్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఉడాకాలనీ, శ్రీనగర్ కాలనీ, జీవీఆర్ కాలనీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలోని సబ్ స్టేషన్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న విద్యుత్ రాయితీని ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు గడప గడపకు మన ప్రభుత్వం దిగ్విజయంగా కొనసాగిందని.. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వారాంతానికి కచ్చితంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ(విద్యుత్) బి.వి.సుధాకర్, డీఈలు రవిచంద్ర, శ్రీధర్, బాలాజీ, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News