-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ సర్కారు పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం సందడి వాతావరణంలో కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవితో కలిసి వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలలో మల్లాది విష్ణు విస్తృతంగా పర్యటించారు. దాదాపు 240 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు, హారతులతో బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. గ్రామ సచివాలయాలు, దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి పరిపాలన ప్రజల ముంగిట నిలిపిన ఘనత జగనన్నదేనని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాలు అమలు, నాడు – నేడు పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం.. ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. తమ దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే సైడ్ కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గడప గడపకు ఆలోచన దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మూడేళ్ల వ్యవధిలోనే ప్రజలకు అపారమైన నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా టీడీపీ నాయకులు ప్రజల మధ్యలోకి వచ్చే ధైర్యం చేయలేకపోయారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి అవసరాలన్నింటినీ తీరుస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన గడప గడపకు మన ప్రభుత్వం ఆలోచన ఇప్పుడు దేశానికే ఆదర్శవంతమైందన్నారు. తెలుగుదేశం హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జన్మభూమి కమిటీలనే దళారులు ఉండేవారని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే మహిళలకు రూ. 233 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్ల కాలంలో అత్యంత పారదర్శకంగా అందజేసినట్లు తెలిపారు. వీరిలో అన్ని పార్టీలకు చెందిన కుటుంబాలు ఉన్నట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం
రాష్ట్రంలో ప్రజల మద్ధతు పూర్తిగా కోల్పోవడంతో ప్రతిపక్ష నాయకులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీడీపీ, జీజేపీ, జనసేన కలిసి కుట్రలు పన్నుతూ.. ముప్పేట దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని గతంలో భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదా..? అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ప్రశ్నించారు. కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది మీరు కాదా..? అని నిలదీశారు. రాష్ట్రంలో వికేంద్రీకరణ మంత్రం సక్సెస్ అయిందని.. గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణలే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో కేంద్రీకృతమైన అభివృద్ధి హైదరాబాద్ లో జరగడం వల్లే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు అమరావతి కూడా బాగుండాలన్నదే వైఎస్సార్ సీపీ సర్కారు ఉద్దేశమన్నారు. కనుక ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించి.. పవన్ కళ్యాణ్ తన పర్యటన రద్దు చేసుకుంటే మంచిదని సూచించారు.
మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
4 రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటివరకు 43 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసుకున్నామని.. ప్రత్యేకించి 57వ డివిజన్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ గురునాథం, నాయకులు కాళ్ల ఆదినారాయణ, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పఠాన్ నజీర్ ఖాన్, చిట్టెమ్మ, భాగ్యలక్ష్మి, బాల, ప్రేమ్, నెల్లి గోవింద్, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News