-పార్టీ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో అత్యంత ఘనంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో నాడు తెల్ల దొరతనాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు నల్ల దొరతనం రాజ్యమేలుతూనే ఉంది. నాడు బ్రిటిష్ పాలకుల నిర్బంధకాండకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1925, డిసెంబరు 26న కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. గడిచిన 97 ఏళ్ల కాలంలో ఎన్నో వీరోచిత పోరాటాలు, మహోన్నత త్యాగాలు, మహత్తర విజయాలకు సీపీఐ ప్రతీకగా నిలిచింది. ఈ విప్లవాత్మక, సాహసోపేత ప్రస్థానం ఇప్పుడు 98వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అనేక కుట్రలు, కుతంత్రాలు, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా లాఠీలు, తూటాలను కూడా లెక్కచేయకుండా ఎందరో కమ్యూనిస్టు నేతలు జైళ్లకు వెళ్లడం, ఉరికంబం ఎక్కడం ద్వారా స్వాతంత్య్ర సమరంలో అగ్రభాగాన ఉండి పోరాడిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. కమ్యూనిస్టుల రక్తతర్పణతో, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోషలిస్టు సమాజ స్థాపనే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగింది. సోషలిస్టు సమాజంలోనే పౌరులందరికీ సమాన అవకాశాలు, ప్రజాస్వామిక హక్కుల లభిస్తాయనీÑ జాతి, వర్గ, కుల, మత, లింగ వివక్ష, దురాగతాల అంతానికి సమ సమాజమే ఆవశ్యకమని విశ్వసించింది. ఆ దిశగా సిపిఐ అలుపెరుగని పోరాటాలు సాగించింది. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది.
ఏనాడూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఛాయలు కనిపించని ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకొని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు సాగిస్తున్నది. గణతంత్ర, స్వతంత్ర భారత్‌ను హిందూదేశంగా మార్చాలని ఆరాటపడుతోంది. అందుకోసం నరేంద్రమోడీ ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తూ కార్పొరేట్ అనుకూల, ప్రజాకంటక విధానాలను అమలును వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో మోదీ సర్కారు రైతులు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, శ్రామికులు, అణగారిన వర్గాల జీవితాలను పణంగా పెట్టేస్తోంది. పర్యవసానంగా అన్ని వర్గాల ప్రజల వెతలు వర్ణనాతీతమయ్యాయి. వారి హక్కులు కాలరాయబడుతున్నాయి. నియంతృత్వ విధానాలు అమలవుతున్నాయి. మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. ప్రజాతంత్ర వాదులపై నిరాఘాటంగా దాడులు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితులలో కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతోÑ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను పరిరక్షించుకునే ఆశయంతో కమ్యూనిస్టులు కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో మహత్తర సిద్ధాంతాల వేదికగా ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానా, వాడవాడలలో అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. తద్వారా ఐక్యపోరాటాలకు సిపిఐ సంకల్పబలం కావాలని ఆకాంక్షిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించి, సిపిఐ వ్యవస్థాపక వేడుకల జయప్రదానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News