విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కు ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో అమ్మవారి అంతరాలయానికి తీసుకువెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం వేదపండితులు జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ కు ఆశీర్వచనాలను అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందచేశారు. జస్టీస్ డి వై చంద్రచూడ్ తో పాటు అమ్మవారిని దర్శించుకున్నవారిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత కుమార్ మిశ్రా,రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ్ రావు, ప్రోటోకాల్ రిజిస్ట్రార్ రాఘవ స్వామి, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ కివిఎల్ హరనాథ్ గుప్తా, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉన్నారు.
Prajavartha Online Telugu News