విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల మేరీమాత ఉత్సవాల ప్రారంభానికి ముందు యేటా నిర్వహించే నవదిన ప్రార్థనలు మరియమాత మహోత్సవ పతా కావిష్కరణతో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేరీమాత పుణ్య క్షేత్రం కొండ దిగువన విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు పతాకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు. అనంతరం పుణ్య క్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజ్ ఆధ్వర్యంలో ఫాదర్లు, సిస్టర్లు, భక్తులు పెద్దసంఖ్యలో కొవ్వొత్తులు చేతబూని జపమాలతో కొండ మధ్య గల మరియమాత గుహ వద్దకు చేరుకున్నారు. బిషప్ తెలగతోటి రాజారావు దివ్యపూజాబలి సమర్పించారు. కరోనా తర్వాత రెండేళ్ల అనంతరం నిర్వహించే మరియమాత ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని మరియమాతను వేడుకున్నట్టు తెలిపారు. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న నవదిన ప్రార్ధనలకు నగరం నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు పెద్దసంఖ్యలో హజరుకానున్నట్టు మోన్సిగ్ఞోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయని ఎస్ఎస్సి డైరెక్టర్ తోట సునీల్ రాజు చెప్పారు. సబ్ కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News