-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా, అభివృద్ధికి కేంద్ర బిందువుగా ముందుకు సాగుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 241 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు సందడిగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, అధికారులతో కలిసి వానపాల వారి వీధిలో పర్యటించిన ఎమ్మెల్యేకి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తమ ఇంటికి విచ్చేసిన ప్రజాప్రతినిధులను ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. 2019 కి ముందు ఇందిరానాయక్ నగర్ ను ఊహించుకోలేమని.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో తక్కువ సమయంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రజల అవసరాలను అనుగుణంగా అభివృద్ధి
ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ఈ ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా వై.వి.ఎస్టేట్ లో రూ. 4.16 కోట్ల నిధులతో 1500 KL ఎలివేటెడ్ రిజర్వాయర్ నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించుకోనున్నట్లు తెలిపారు. దీని ద్వారా శివారు కాలనీలలోని ప్రతిఒక్క ఇంటికీ రెండు పూట్ల సరిపడా మంచినీటి ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడకుండా.. ఆర్.యు.బి.ని ఇటీవల పునరుద్ధరించడం జరిగిందన్నారు. న్యూ రాజరాజేశ్వరి పేటలోని వంతెన కూడా గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నిర్మించుకున్నట్లు గుర్తుచేశారు. అలాగే నియోజకవర్గంలో దాదాపు 25వేల పేద కుటుంబాలు దశాబ్దాల కాలంగా ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ సమస్యకు మార్చి నాటికి పరిష్కారం చూపుతామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా హక్కుతో కూడిన పట్టాలను అందజేస్తామని స్పష్టం చేశారు.
నారా లోకేష్ భాష సంస్కారహీనం
అధికార దాహంతో సభ్య సమాజం తలదించుకునేలా సంస్కారహీనమైన భాషను నారాలోకేష్ మాట్లాడుతున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబు, నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భయపెడతామని బీరాలు పలకడం హాస్యాస్పదమన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని.. ఓర్వలేక టీడీపీ నీచ రాజకీయాలకు తెరదీసిందన్నారు. తెలుగుదేశం నేతల ఓటమి భయం వారి మాటలలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. లాస్ట్ ఛాన్స్ అంటున్న చంద్రబాబుకు, ఫస్ట్ ఛాన్స్ అంటున్న పవన్ కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్‌ను సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో డివిజన్ కు చేసింది శూన్యమని విమర్శించారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజల విజ్ఞాపనల మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు నూతన రహదారులను నిర్మింపజేసినట్లు తెలిపారు. కానీ తమ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేక.. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, శర్మ, రాజు, భోగాది మురళి, తోపుల వరలక్ష్మి, ఇసరపు రాజారమేష్, సతీష్ రెడ్డి, నేరెళ్ల శివ, కె.శ్రీనివాసరావు, U.మురళి, శోభనాలు, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News