Breaking News

సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారం 58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎక్సెల్ ప్లాంట్ రోడ్డు, శివాలయం వీధిలో విస్తృతంగా పర్యటించి.. 223 గడపలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ లబ్ధితో రూపొందించిన బ్రోచర్లను ఆయా కుటుంబాలకు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు ఇంటివద్దకే అందుబాటులోకి వచ్చినట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత మూడున్నరేళ్లలో సచివాలయ పరిధిలో రూ. 4.07 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సాయాన్ని లబ్ధిదారులే వివరిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ అపూర్వ మద్ధతు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. సైడ్ కాలువలలో ఎప్పటికప్పుడు పూడికను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్న క్రమంలో.. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు స్టేటస్ ను వివరించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీడీపీ హయాంలో అవినీతి విలయతాండవం
చంద్రబాబు హయాంలో సెంట్రల్లో అవినీతి విలయతాండవం చేసిందని మల్లాది విష్ణు విమర్శించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పేదలను ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆరోపించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ పేరుతో మాయ మాటలు చెప్పి ప్రజలను నిలువునా మోసగించారని దుయ్యబట్టారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో 25 వేల మంది పేద కుటుంబాలకు మేలు చేకూరుతోందని మల్లాది విష్ణు చెప్పారు. అలాగే అభ్యంతరం లేని ఆక్రమిత భూముల్లో 150 గజాలలోపు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ద్వారా 5 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని వివరించారు. ఇవన్నీ మీ హయాంలో చేయలేకపోయినందుకు సిగ్గుపడాలన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలతో ప్రజలలో ఈ ప్రభుత్వంపై నమ్మకం విపరీతంగా పెరగడంతో.. చూసి ఓర్వలేక పచ్చ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

ఏపీకి చేసిన ద్రోహానికి బీజేపీ నేతలు లెంపలేసుకోవాలి
కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించే ముందు.. ఆంధ్రప్రదేశ్ కి చేసిన ద్రోహానికి ముందుగా లెంపలేసుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. కర్నూలులో కేంద్ర సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు, నైసర్గిక స్వరూపం గూర్చి కనీసం తెలియని చౌహాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని అంశాలను ఎందుకు అమలు చేయడం లేదో ముందుగా కేంద్ర సహాయ మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఉండాలని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను ఎందుకు తుంగలో తొక్కుతున్నారని సూటిగా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఎందుకు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు..? ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అంతేగానీ బాధ్యతను విస్మరించి బీజేపీ నేతలు సత్యకుమార్, జీవీఎల్ నరసింహరావు లాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నేతలకు మతిభ్రమించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. సత్యకుమార్ చెప్పేవన్నీ అసత్యాలేనని.. జీవీఎల్ కనీస జ్ఞానం కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డుల ప్రకటిస్తూనే.. మరోవైపు నిస్సిగ్గుగా ఎలా విమర్శలు చేస్తారని నిప్పులు చెరిగారు. ఇకనైనా బీజేపీ నేతలు వ్యక్తిగత అజెండాతో పనిచేయడం మానుకోవాలని.. లేకుంటే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, క్రాంతి, శ్రీనివాసరెడ్డి, శ్యామ్ కుమార్, శర్మ, తోపుల వరలక్ష్మి, బొందిలి శైలజా, ఇస్మాయిల్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *