-జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల హక్కుల పరిరక్షణ ఒకరితో సాధ్య పడదని, ఇది అందరి బాధ్యతగా గుర్తిస్తేనే సాధ్యమవుతుందని ముఖ్యంగా ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం, ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారిక సూచించారు.
‘నల్సా’ ( మాదకద్రవ్య బాధితులకు న్యాయ సేవలు, మాదకద్రవ్యాల ముప్పు నిర్మూలన ) పథకం, నల్సా ( పిల్లలు వారి రక్షణ కోసం స్నేహపూర్వక న్యాయ సేవలు ) పథకం ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సేవాసంస్థ, కృష్ణాజిల్లా పరిపాలన యంత్రాంగం, సంయుక్త ఆధ్వర్యంలో ‘ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జాతీయ న్యాయసేవాధికార సేవా సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సేవా సంస్థల ఆదేశాల మేరకు నూతన తరహా న్యాయ సేవల శిభిరం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో శనివారం ఉదయం నిర్వహించారు.
వందేమాతరం ప్రార్ధన గీతం తర్వాత వేదికపై ఉన్న అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి లీగల్ సర్వీసెస్ క్యాంపు మాడ్యుల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా న్యాయసేవాధికార సేవా సంస్థ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య న్యాయసేవాధికార సేవా సంస్థ సేవలను సంక్షిప్తంగా వివరించారు.
తొలుత స్థానిక మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని అద్దంకి శర్వణి కూచిపూడి నృత్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీ యుపి పాఠశాల ఎస్.ఎన్ గొల్లపాలెం బాల బాలికలు ‘ మంచి స్పర్శ..చెడు స్పర్శ ‘ అని అంశంపై స్కిట్ ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. స్థానిక జవహర్ పబ్లిక్ స్కూల్ బాలికలు ‘ మగువా..మగువా.. లోకానికి తెలుసా నీ విలువ.. నీ సహనానికి సరిహద్దులు కలవా ‘ అనే పాటకు అనుబంధం చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. అనంతరం ఆకర్ష ఫౌండేషన్ నిర్వహణలో మాదకద్రవ్యాల వినియోగంలో తలెత్తిన విషమ పరిస్థితులను వివరిస్తూ ‘ నీవు మారాలి… నీలో మార్పు రావాలి ‘ అనే సంక్షిప్త నాటకం ఎంతో రక్తి కట్టించింది. వ్యసనాల బారిన పడిన పుత్రుడు. తన బిడ్డను మార్చుకోవాలని తపన పడే తండ్రి ఈ రెండు పాత్రలను పోషించిన అజయ్, నాగరాజు తమ విశేష నటనతో అద్భుతంగా జీవించి ప్రేక్షకుల కంట కన్నీరు రప్పించి పెద్దపెట్టున కరతాళ ధ్వనులను మోగింపచేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాల బాలికల హక్కులు, జువైనల్ ఆక్ట్, ఫోక్సో చట్టం, బాల బాలికలకు న్యాయ సహాయం గూర్చి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి దేవి శ్రీ సాయి వాణి వివరించారు.
తర్వాత మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎం. వెంకట భవాని మాట్లాడుతూ, బాల బాలికలకు సంపూర్ణ ఆరోగ్యం,నాణ్యమైన ఉచిత విద్య, ఆడుకోవడం, వినోదం, పరిశుభ్రమైన తాగునీరు, పోషకాహారం, గౌరవం, సమానత్వం,భావ వ్యక్తీకరణ,సమాన విద్యావకాశాలు, స్వేచ్ఛగా ఆలోచించడం,మానసిక,శారీరక వేధింపుల నుంచి విముక్తి, ప్రేమ,ఆప్యాయతలు,సామాజిక భద్రత. ఎంతో ప్రాముఖ్యమైనదిన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన చట్టాలను వివరించారు. 2012లో ఫోక్సో చట్టం గురించి వివరిస్తూ, పద్దెనిమిదేళ్లలోపు పిల్లలపై లైం గిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయొచ్చన్నారు. నేరం రుజువైతే సాధారణ శిక్ష మొదలుకొని కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు, మరణశిక్ష విధించొచ్చని తెలిపారు. పన్నెండేళ్ల బాలికలపై అత్యాచారం చేసిన కేసులో ఉరిశిక్ష విధించేలా పోక్సో చట్టాన్ని సవరించారన్నారు. అలాగే,బాల్య వివాహాల నిరోధక చట్టం- 2006 గురించి తెలియజేస్తూ ఈ చట్టం ప్రకారం పద్దెనిమిదేళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరమన్నారు. బాల, బాలికలను వివాహం చేసుకున్న వ్యక్తులు.పెళ్లికి కారణమైన పెద్దలు, ఇరు కుటుంబసభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని చెప్పారు.బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం- 2015 ఈ చట్టం ద్వారా బాలికలు అవసరమైన రక్షణ, వసతి పొందొచ్చు. న్యాయసేవాధికార చట్టం -1987 : ఈ చట్టం ప్రకారం బాలబాలికలు న్యాయ సహాయం పొందటానికి అర్హులు.
ఆర్టికల్-24 : పద్నాలుగేళ్ల పిల్లలను కర్మాగారాల్లోకానీ, గనుల్లోకానీ, ఏ ఇతర అపాయకరమైన వృత్తుల్లో పని చేయించకూడదని వివరించారు. అలాగే ఆర్టికల్- 30 ప్రకారం పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో, గౌరవప్రదమైన, స్వేచ్ ఛాయుత పరిస్థితుల్లో,అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించాలన్నారు.
ఆర్టికల్-45 బాలలకు ఉచిత నిర్బంధ విద్యను సూచించడమే కాకుండా బాధిత పిల్లలు లేదా వారి తరపున పెద్దలు ఎవరైనా ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’ వెబ్ సైట్ లో నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. నమోదు ఫిర్యాదులపై దేశవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. బాలలు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. లైం గిక వేధింపులను ధైర్యం గా ఎదుర్కొనేందుకు ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుందని వివరించారు.
అనంతరం మొదటి అదనపు జడ్జి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ, డ్రగ్స్కు బానిసలై ఉగ్రవాదులుగా మారుతున్న వారెంతో మంది సమాజానికి చీడపురుగుల్లా తయారవుతున్నారని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారన్నారు. వీరి వలన దేశ అభివృద్ధి ఆగిపోతోందన్నారు. విద్య, వైద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వాలు సింహభాగం నిధులను అరాచకశక్తుల అణచివేతకోసం, బాహ్య, ఆంతరంగిక, అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికే వెచ్చించవలసి వస్తున్నదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై అధిక నిధులు వెచ్చించలేక పోవడం గమనార్హం అన్నారు మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావాలని, సకల అనర్ధాలకు సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు మత్తే ప్రధాన కారణంగా అనేక సర్వేలు సూచిస్తున్నాయిని వివరించారు. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ను యువత నుంచి దూరం చేయాలని డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సమాజం మరింత కృషి చేయాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిని పారదోలి వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని న్యాయమూర్తి సూచించారు.
తర్వాత దిశా డి.ఎస్.పి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో యాంటీ ర్యాగింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ నివారణ సమర్థవంతంగా అమలు చేసేమన్నారు.
మహిళల కోసం దిశా చట్టం వచ్చిందని దిశా యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారిని తక్షణమే కాపాడే సేవలు తమ శాఖలో అందుబాటులో ఉన్నాయన్నారు.
అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా, రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యదర్శి చీలి ముసలయ్యలు యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాలు వినిమయం, నివారణ చర్యలు, చట్టపరమైన శిక్షలు తదితర అంశాలపై ప్రసంగించారు
వికలాంగుల సంక్షేమ శాఖ రాంకుమార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎఫ్ చైర్ పర్సన్ చేతుల మీదుగా పి నాగరాజు, కె. ప్రభు కిరణ్ ల్యాప్ టాప్ లు అందించారు. అలాగే, చల్లా నాగ తేజ, కె. సుకన్యకు టచ్ మొబైల్ ఇవ్వగా, బి. పార్వతమ్మకు వినికిడి సాధనం అందచేశారు
ఆకట్టుకున్న స్టాళ్లు..
లీగల్ సర్వీసెస్ క్యాంపు మాడ్యుల్ లో భాగంగా ప్రభుత్వ స్టాళ్లను ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేశారు. న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సేవలను వివరిస్తూ ఒక స్టాల్, స్త్రీశిశు సంక్షేమ శాఖ , ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, వికలాంగ సంక్షేమ శాఖ , రెవెన్యూ, , డి ఎం హెచ్ ఓ హెల్త్ క్యాంపు, క్రైమ్, దిశా సాస్ అవగాహన , డి ఆర్ డి ఏ స్టాల్ , సమగ్ర శిక్ష అభియాన్, చేనేత కలంకారీ తదితర స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేసారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు. స్టాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణా సారికా, మొదటి అదనపు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, పదవ అడిషనల్ జడ్జ్ నరసింహమూర్తి, సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News