-వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తున్న ద్వారావతి ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహర్తిని తీర్చేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని త్రాగునీరు మజ్జిగ అందించేందుకు దాతలు మందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు. కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించారు. అర్జీదారులకు మజ్జిగ పంపిణీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో ఎండలు మెండుగా వుంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారన్నారు. ఇప్పటికే నగరంలో ఎండ తీవ్రత పెరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుండే కాక ఇతర ప్రాంతాల నుండి నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తారన్నారు. ప్రజల ఎండ తీవ్రత నుండి తట్టుకునేందుకు చలువ పందిళ్ళను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. రద్దీ ప్రాంతాలలో ప్రజలకు నీడను కల్పించేలా వ్యాపారస్తులు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వీలైనన్ని ప్రాంతాలలో చలువ పందిళ్ళను ఏర్పాటు చేసి చల్లని త్రాగునీరు మజ్జిగ సరఫరా చేసేలా స్వచ్చంద సంస్థలు దాతలు వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు కృషి చేసి ప్రజల దాహర్తిని తీర్చడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. వేసవి కాలం పూర్తి అయ్యేవరకు మూడు నెలల పాటు ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అర్జీదారులకు అధికారులకు సిబ్బందికి మజ్జిగ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన ద్వారావతి ఫౌండేషన్ ప్రతినిధులను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ద్వారావతి ఫౌండేషన్ చైర్మన్ జి. సంతోష్ కుమార్ సాయి మాట్లాడుతూ తమ సంస్థ గౌరవ అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం పాత బస్తీలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు ఉచిత వైద్య సహయం అందిస్తున్నామన్నారు. గుణదల విభిన్నప్రతిభావంతుల పాఠశాల వారానికి రెండు రోజుల పాటు మిగిలిన ఐదు రోజులు అనాధాశ్రయాలకు 200 మంది భోజనం పంపిణీ చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో సుమారు 2 లక్షల 50 వేల మందికి కు పైగా రోగులకు ఉచితంగా భోజనం సరఫరా చేశామని, రక్త దాన శిబిరాలను నిర్వహించి అవసరమైన రోగులకు ఉచితంగా రక్తాన్ని అందజేస్తున్నామన్నారు. మైలవరం సమీపంలోని గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మించేందుకు ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. దూర ప్రాంతాల నుండి స్పందన కు వచ్చే అర్జీదారులకు అవసరమైతే భోజన సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ద్వారావతి ఫౌండేషన్ ప్రతినిధులు వై సుధాకర్, టి బాలాజీ, డి. కాసిమ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News