-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-276 వ వార్డు సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గురువారం 63 వ డివిజన్ 276 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. సుందరయ్యనగర్లో విస్తృతంగా పర్యటించి.. 193 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా సంతకం చేసిన సంక్షేమ బుక్ లెట్లను అందజేశారు. విద్యా, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత.. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టడం వెనుక గల ఆవశ్యకతను లబ్ధిదారులకు వివరించారు. కరోనాతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆపలేదన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మూగ జీవాలపై రాజకీయాలా..?
రాజకీయాలలో ప్రతిపక్షాలు ఎప్పుడూ హుందాతనం పాటించాల్సిన అవసరం ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు, సీఎం జగన్ కు నక్కకీ, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. చివరకు నోరులేని మూగ జీవాలపైనా రాజకీయాలు చేసే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని మండిపడ్డారు. గెలిచే అవకాశమే లేని స్థితిలో చంద్రబాబు, టీడీపీ శ్రేణులు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గూర్చి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్షనేతకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. జోనింగ్ వ్యవస్థతో జిల్లా రైతులను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. మరోవైపు టీడీపీ హయాంలో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై టీడీపీ నేతలు బహిరంగ దాడికి తెగబడితే.. కనీసం మందలించే ప్రయత్నం కూడా చేయని చంద్రబాబు రౌడీయిజం గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన భాష, పద్ధతి మార్చుకోవాలని మల్లాది విష్ణు సూచించారు.
మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
276వ సచివాలయ పరిధిలోని ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటివరకు 61 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో కూలీలు, ఆటో కార్మికులు, వ్యాపారస్తులు సహా అన్ని వర్గాల ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ(వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, ఆర్ఐలు ప్రసాద్, సరత్, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, నాగు, టెక్యం కృష్ణ, సామ్రాజ్యం, నాగలక్ష్మి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News