విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 62వ డివిజన్ ప్రకాష్ నగర్ కు చెందిన చల్లగురుగుల వాసుదేవ(17).. గత కొద్దికాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నారు. వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్తోమత లేక ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసి పరిస్థితిని వివరించడంతో.. ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు మంజూరైన రూ. 3.20 లక్షల ఎల్ఓసి పత్రాన్ని గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. ఆరోగ్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకురాలేదని చెప్పుకొచ్చారు. ఏ వైద్య సేవలైనా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఏపీలోనే సకల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గొప్ప మానవతావాది సీఎంగా లభించడం పేదల అదృష్టమని కొనియాడారు. పేదలకు, అభాగ్యులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: తల్లిదండ్రులు
వాసుదేవ తల్లిదండ్రులు చల్లగురుగుల దుర్గారావు, పైడితల్లి మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారిని కలిసి నా కుమారుడి పరిస్థితి గురించి వివరించాం. ఎంతో ఉదారంగా స్పందించిన ఆయన ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి రూ.3.20 లక్షలు అందించడం సంతోషంగా ఉంది. మాది పేద కుటుంబం, వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అండగా నిలవడం ఎన్నటికీ మరువలేము” అని తెలిపారు. సమస్యను తమ దృష్టికి తీసుకెళ్లిన వెనువెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు అలంపూర్ విజయ్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News