-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల పథకాల అమలుతో పాటు అడగ్గానే ఆపన్న హస్తం అందించే పేదల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. హనుమాన్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 211 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిపై బుక్ లెట్లను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని పథకాలనూ అమలు చేస్తూ.. ప్రజల మనస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని మల్లాది విష్ణు తెలిపారు. పక్క రాష్ట్రాల్లో కూడా మన పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది జగనన్న పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కాలనీలో ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా ఛాంబర్లను నిర్మించాలని ఇంజనీరింగ్ విభాగానికి తెలిపారు. అలాగే ఎక్కడా తాగునీటి పైపులైన్ల లీకులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బుడమేరు ప్రక్షాళన పనులను పర్యవేక్షించారు.
మెరుగైన సేవల కోసం ‘జగనన్న సురక్ష’
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా జూలై 1 నుంచి అన్ని వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయడం ఉండవని పేర్కొన్నారు. ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు ఉంటుందో ముందస్తుగా అందరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ‘జగనన్నకు చెబుదాం’కు అనుబంధంగా చేపట్టిన ఈ కార్యక్రమం నాలుగు వారాల పాటు ఉంటుందని.. ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కుట్ర
రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ కు వ్యసనంగా మారిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విమర్శించారు. కుల భావన లేదని చెబుతూనే.. మరోవైపు నిస్సిగ్గుగా జనసేన అధినేత కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను పచ్చ మీడియా జాకీ పెట్టి లేపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒక ఫెయిల్యూర్ యాత్రని పతాక శీర్షికల ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ యత్నిస్తుంటే.. పవన్ ఇలా కుల రాజకీయం చేయటం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం కొనసాగుతోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేయడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. అటువంటి ముఖ్యమంత్రిపై కుల ముద్ర వేయాలని చూడటం సిగ్గుచేటని.. ఇకనైనా ఇటువంటి క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, పిల్లి కృష్ణవేణి, బండి వేణు, కొంగితల శివ, వై.శ్రీనివాస్, నాగరాజు, కొలకలేటి రమణి, అనురాధ, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News