-డ్రాపవుట్స్ రెగ్యులర్గా పాఠశాలలకు వచ్చేలా కౌన్సిలింగ్ నిర్వహించాలి-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గుర్తించిన డ్రాప్ అవుట్స్ విద్యార్థులను బడిలో చేర్పించడంతోపాటు, వారు రెగ్యులర్ గా పాఠశాలలకు హాజరయ్యేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నాడు- నేడు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్) నూరు శాతం సాధించుటకు చర్యలు తీసుకోవడంతోపాటు లక్ష్య సాధనలో సమస్యలు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా గుర్తించిన బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం జరుగుతోందని అన్నారు అయితే కొంతమంది పిల్లలు రెండు మూడు రోజులు బడికి హాజరై తదుపరి గైర్హాజరు కావడం వల్ల జి ఈ ఆర్ తగ్గడం జరుగుతున్నదన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే డ్రాప్ అవుట్ పిల్లలు రెగ్యులర్గా బడికి హాజరయ్యాలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక శ్రద్ధ కనపరచి అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జగనన్న విద్యా కానుక క్రింద జిల్లాలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బెల్టు షూస్ స్కూల్ బ్యాగ్ వంటి 11 రకాలైన ఐటమ్స్ తో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లు నూరు శాతం పంపిణీ జరిగిందన్నారు
డిజిటల్ విద్యా బోధనలో భాగంగా జిల్లాలో 230 పాఠశాలల్లో 729 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 257 స్మార్ట్ టీవీలు నూరు శాతం ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నారు. ఏర్పాటు చేయబడిన పరికరాలు వినియోగంపై జిల్లాలో 4500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. వాటిని నూరు శాతం వినియోగించేలా చూడాలని అన్నారు.
2022-23 సం. జిల్లాలో 1.29 లక్షల మంది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.
జగనన్న గోరుముద్ద అమలులో ఎక్కడైనా లోపాలు జరిగితే సహించమని, పక్కాగా అమలు అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంఈఓ లు పాఠశాలలు విజిట్ చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు ఎక్కడ లోపాలు లేకుండా పర్యవేక్షించాలన్నారు.
నాడు నేడు మొదటి దశలో జిల్లాలో 587 పాఠశాలల్లో 102.76 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి పరిచినట్లు, రెండో దశలో 488 పాఠశాలల్లో 180 కోట్లతో మోలికవసతుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మొదటి దశలో మిస్సయిన మౌలిక వసతుల అభివృద్ధి పనులు నాడు నేడు ఫేజ్ 2 ఏ కింద 587 పాఠశాలల్లో 9 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ ద్వారా జిల్లాలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సి డి) సర్వే 82 శాతం నిర్వహించినట్లు ఈ సర్వేలో ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి హైపర్ టెన్షన్ మధుమేహం వంటి వ్యాధులు గల వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం లక్ష్యం అన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు సంబంధించి కలెక్టర్ సమీక్షిస్తూ నెలలో ప్రతి గ్రామం రెండుసార్లు వైద్య బృందం సందర్శించేలా అందర్నీ కవర్ చేసే లా చర్యలు తీసుకోవాలన్నారు.
డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, డీఈవో తాహెరా సుల్తానా, డి ఎం అండ్ హెచ్ వో డాక్టర్ గీతాబాయి, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డి ఎల్ డి వో సుబ్బారావు కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి శివ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News