– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా బోధనకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధునాతనమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యాలయాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితులలో ఉండేవని.. కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల కంటే 3 రెట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఖర్చు చేస్తోందని.. నాలుగేళ్లలో అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. అమ్మఒడి, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్.. ఇలా చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం చేయగలిగినంతా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విప్లవానికి నాంది పలుకుతూ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేయడం జరుగుతోందన్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న విద్యారంగ సంస్కరణలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నాడు-నేడు స్టాల్ ను ప్రదర్శించడం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపరచుకుని.. ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైస్కూల్ వైస్ ప్రిన్సిపల్ మనోహర్, ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఇమాం బాష, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, కంభగళ్ల రాజు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News