– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-59 వ డివిజన్ 244 వ సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి అని చెప్పడమే కాకుండా.. ఆ దిశగా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ 244 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందడి వాతావరణంలో సాగింది. స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా, అధికారులతో కలిసి అజిత్ సింగ్ నగర్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. 254 గడపలను సందర్శించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల బుక్ లెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. శాలువలతో ఘనంగా సత్కరించారు. ప్రజల చల్లని దీవెనలతో తిరుగులేని మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి.. గత నాలుగేళ్లలో ప్రజాదరణ రెట్టింపు అయిందని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాలనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్నారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలలో 98.5 శాతం అమలు చేయడంతో పాటుగా.. మేనిఫెస్టోలో పేర్కొనని మరెన్నో హామీలను అమలు చేశారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, పవన్ వి ద్వంద్వ విధానాలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. అసూయతో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది ద్వంద్వ విధానాలని.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా, అధికారం కోసం ఇంకోలా మాట్లాడటం వీరికే చెల్లిందన్నారు. మరీముఖ్యంగా పవన్ ఆలోచన, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో డేటా చౌర్యం జరిగినప్పుడు మిత్రపక్షంలో ఉండి పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మల్లాది విష్ణు అన్నారు. నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా డేటాను దొంగలించినప్పుడు జనసేన అధినేత ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. అలాగే వాలంటీర్లను పవన్ నానా దుర్భాషలాడినప్పుడు మాట్లాడని చంద్రబాబు.. ప్రభుత్వం పరువునష్టం కేసు పెడితే గింజుకోవడం సిగ్గుచేటన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆదారాభిమానాలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలలో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, కంభగళ్ల రాజు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ, నాయక్, పిల్లి లక్ష్మి, శాంతకుమారి, దినేష్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News