– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో కోట్లాది రూపాయల నిధులతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. దేవీనగర్ మధ్యకట్టలో రూ. 40 లక్షల నిధులతో చేపట్టిన రహదారుల నిర్మాణాలకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన నిర్వహించారు. గత తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతంలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిని ఇబ్బందికరంగా తయారయ్యాయని మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దృష్టికి వచ్చిన ప్రతి చిన్న సమస్యను.. నిర్ణీత గడువును నిర్దేశించుకొని మరీ పూర్తిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 71 వార్డు సచివాలయాల పరిధిలో రూ. 12.06 కోట్ల నిధులతో గడప గడపకు మన ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీటిలో 14 వార్డు సచివాలయాల పరిధిలో రూ. 1.21 కోట్ల మేర పనులు పూర్తిచేసుకోగా.. 27 సచివాలయాల పరిధిలో రూ.5.09 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు వివరించారు. మరో 30 వార్డు సచివాలయాల పరిధిలో రూ.5.75 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులకు.. అభివృద్ధి వారోత్సవాలలో భాగంగా శంకుస్థాపనలు నిర్వహించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నిరుపేదలు, సామాన్యులు అత్యధికంగా నివసించే మధ్యకట్ట ప్రాంతంలో రూ. 40 లక్షలతో రోడ్ల నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అభివృద్ధి భవిష్యత్ లోనూ ఇదేరీతిలో కొనసాగుతుందని.. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చేతులమీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకునే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, నాయకులు శ్రీను, కృష్ణ, ముత్యాలు, ప్రసాద్, రామకృష్ణ, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News