– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 20 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నియోజకవర్గంలో పెనుమార్పు వచ్చిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 61వ డివిజన్ శాంతినగర్లో రూ. 20 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. చంద్రబాబు పాలనలో డివిజన్లో జరిగిన అభివృద్ధి శూన్యమని మల్లాది విష్ణు విమర్శించారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని గుర్తుచేశారు. గత పాలకులకు గాళ్ల వెంకయ్య కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ వంటి ప్రాంతాలు ఉన్నట్లు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో డివిజన్లో రూ.13.15 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు.. పాయకాపురం చెరువు పార్కును రూ. 3.71 కోట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, నాళం బాబు, ఎస్.కోటేశ్వరరావు, ఆర్.ఎస్.నాయుడు, స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News