విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులను వేగవంతం చేసేందుకు వారంవారిగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ డిల్లీరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనుల ప్రగతిని పంచాయితీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజినీర్లు, నగరపాలక సంస్థ, తిరువూరు, జగ్గయ్యపేట. నందిగామ మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీఎంపీలో మంజూరైన పనులు ఇప్పటివరకు పూర్తైన పనులు, అప్లోడ్ చేసిన బిల్లులు, విడుదలైన మొత్తం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ కార్యక్రమంలో మంజూరుచేసిన 1,156 పనుల్లో పూర్తయినవి మినహా వివిధ దశల్లో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన పనులకు సంబంధించి నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని అదేవిధంగా పనులకు సంబంధించి బిల్లులను అప్లోడ్ చేయడం ద్వారా త్వరితగతిన నిధుల మంజూరుకు అవకాశం ఉంటుందన్నారు. అధికారులు తుది దశలో ఉన్న పనులపై దృష్టిసారించి పనుల పూర్తికి కృషిచేయాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖల పరిధిలో మంజూరు చేసిన పనులతో పాటు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఇతర మునిసిపాలిటీల పరిధిలో మంజూరు చేసిన పనుల ప్రగతిని ఆయా శాఖల విభాగాధిపతులు, కమిషనర్లు ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించి పనుల పూర్తికి కృషిచేయాలన్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులను సత్వరం పూర్తిచేసేందుకుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
కాన్ఫరెన్స్ లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్,పంచాయితీరాజ్ ఎస్ సి ఎ. వెంకటేశ్వరరావు, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్సి డీవి. రమణ, సీపీవో వై.శ్రీలత, నందిగామ ఆర్డీవో పి.సాయిబాబా, తిరువూరు ఆర్డీవో కె.మాధవి, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ మునిసిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News