Breaking News

మాతా, శిశు మ‌ర‌ణాల పూర్తిస్థాయి నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టండి…

-గ‌త మ‌ర‌ణాల స‌మ‌గ్ర విశ్లేష‌ణతో ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లుచేయండి…
-వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మాతా, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా కృషిచేయాల‌ని.. గ‌త మ‌ర‌ణాల‌ను స‌మ‌గ్రంగా విశ్లేషించి పూర్తిస్థాయిలో మ‌ర‌ణాల నియంత్ర‌ణ‌కు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను అమ‌లుచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. వైద్య‌, ఆరోగ్య‌శాఖ జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి జిల్లాలో చోటుచేసుకున్న మాతా, శిశుమ‌ర‌ణాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌లో చోటుచేసుకున్న రెండు మాతృ మ‌ర‌ణాలతో పాటు జులై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో సంభ‌వించిన నాలుగు శిశు మ‌ర‌ణాలకు సంబంధించిన నివేదిక‌ల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మాతా, శిశు మ‌ర‌ణాల‌కు కార‌ణాల‌ను విశ్లేషించి, ఇలాంటి మ‌ర‌ణాలు చోటుచేసుకోకుండా భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణను సిద్ధం చేసి, అమ‌లుచేయాలన్నారు. ప్ర‌తి మ‌ర‌ణంపైనా సంస్థాగ‌త‌, డీఎంహెచ్‌వో, జిల్లాస్థాయిలో స‌మ‌గ్ర విశ్లేష‌ణ, త‌ద్వారా రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌తో మ‌ర‌ణాల‌ను శ‌త‌శాతం నివారించేందుకు వీల‌వుతుంద‌న్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి అవ‌స‌ర‌మైన అన్ని వైద్య ప‌రీక్ష‌లు చేయించుకునేలా గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌లు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. వీరు త‌ర‌చు గ‌ర్భిణీల ఇళ్ల‌ను సంద‌ర్శించి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా పౌష్టికాహారం తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మాతా, శిశు సంర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకునేలా క్షేత్ర‌స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. గ‌ర్భిణులు పౌష్టికాహారం తీసుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం చూప‌కుండా చూడాల‌న్నారు. రిజిస్ట్రేష‌న్ ద‌గ్గ‌రి నుంచి గ‌ర్భిణీల ఆరోగ్యం వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌క్ర‌మంగా న‌మోదు చేయాల‌ని, ముప్పు అధికంగా (హైరిస్క్‌) ఉన్న‌వారి పట్ల వైద్యులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని సూచించారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంత పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందికి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక అవ‌గాహ‌న త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌న్నారు. మాతా, శిశు మ‌ర‌ణాల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాలు, విధానాల అమ‌ల్లో ఎవరైనా నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్లు తేలితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు స్ప‌ష్టం చేశారు.

నిమోనియాపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించాలి: క‌లెక్ట‌ర్ డిల్లీరావు
ఐదేళ్ల‌లోపు చిన్నారుల మ‌ర‌ణాల‌కు ఒక ముఖ్య కార‌ణంగా ఉన్న నిమోనియాపై విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధికారుల‌ను ఆదేశించారు. ఆయ‌న క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌తో క‌లిసి నిమోనియాపై రూపొందించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నిమోనియా ల‌క్ష‌ణాలు, నిమోనియా నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌రాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. అదే విధంగా ఇన్‌పేషెంట్‌, అవుట్‌పేషెంట్ నిమోనియా కేసుల నిర్వ‌హ‌ణ‌పై వైద్య‌, ఆరోగ్య సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు సూచించారు.
కార్య‌క్ర‌మంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయ‌క్‌, డీఐవో డా. అమృత‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ఇందుమ‌తి, సీనియ‌ర్ గైన‌కాల‌జిస్ట్ డా. ప్ర‌భావ‌తి, జీజీహెచ్ వైద్యాధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *