గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని రేట్ పెయర్స్ అసోసియేషన్ సభ్యులు నగర కమిషనర్ ని కోరారు. శుక్రవారం కమిటి సభ్యులు కమిషనర్ ని చాంబర్ లో కలిసి డ్రైన్లలో పూడికతీత, త్రాగునీటి సరఫరా, అభివృద్ధి పనుల పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడిక ఈ ఏడాది బాగా తీశారని, కాని అంతర్గత డ్రైన్లలో పూడిక సక్రమంగా తొలగించలేదని తెలిపారు. ఇటీవల తుఫాన్ వలన అవుట్ ఫాల్ డ్రైన్లలో కమిషనర్ చొరవతో యుద్దప్రాతిపదికన వ్యర్ధాలను తొలగించడం వలన నీరు నిల్వ లేదని, కాని నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోజుల తరబడి నిలిచిందన్నారు. అంతర్గత డ్రైన్లలో పూడిక తీత పనులను సమగ్రంగా చేపట్టాలని కోరారు. త్రాగునీటి సరఫరాలో క్లోరిన్ ను తగు మోతాదులో కలపాలన్నారు. నగరంలో జరుగుతున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎమినిటి కార్యదర్శుల ద్వారా పర్యవేక్షణ చేయించాలని సూచించారు. కమిషనర్ కీర్తి చేకూరి కమిటి సభ్యులతో మాట్లాడుతూ ఇప్పటికే డ్రైన్ల శుభ్రానికి నాలా క్లీనింగ్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయని త్వరలో అన్ని డ్రైన్ల శుభ్రానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. ఎక్కడైనా పూడిక తీసిన డ్రైన్ లో ఫిర్యాదు అందితే సంబదింత కాంట్రాక్టర్ తిరిగి పూర్తిగా పూడిక తీస్తేనే బిల్స్ చెల్లించాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. సమావేశంలో ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ (ఎఫ్ఏసి) మధుసూదన్, కమిటి సభ్యులు పరంధామయ్య, జోగారావు, నారాయణ రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News