Breaking News

సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

-ఈ నెల 15లోగా రాజధాని రైతులకు కౌలు చెల్లించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-సీపీఐ, రాజధాని అమరావతి రైతుల జేఏసీ ఆధ్వర్యంలో సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన రైతులు
-అడ్డుకున్న పోలీసులు, నిరసనకు దిగిన రైతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ, రాజధాని అమరావతి రైతుల జేఏసీ ఆధ్వర్యంలో రాజధాని రైతులు విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు వంద మంది రైతులు నినాదాలు చేస్తూ సిఆర్‌డిఎ కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు కార్యాలయం గేట్లు మూసేసి అడ్డుకున్నారు. వినతిపత్రం ఇవ్వటానికి వస్తే లోపలికి ఎందుకు రానియ్యటం లేదని నిలదీస్తూ, రైతులు పెద్దపెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధర్నాను ఉద్ధేశించి మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఆర్డీఏ కమీషనర్‌కు వినతి పత్రం అందించేందుకు రాజధాని నిర్మాణానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతులు, ఆ భూములపై ఆధారపడిన రైతు కూలీలు వస్తే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. నేటికీ కౌలు, పింఛన్లు అందక రైతులు, రైతు కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురువుతున్నారు. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగలోగా కౌలు చెల్లించి సన్నకారు, చిన్నకారు రైతులతోపాటు దళిత, బలహీనవర్గాల రైతులందరినీ ఆదుకోవాలని కోరారు. పేద అసైన్డ్‌ రైతులకు గత మూడు సంవత్సరాలుగా వివిధ కారణాలతో కౌలు నిలుపుదల చేశారని, వారి కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని తెలిపారు. సత్వరమే అసైన్డ్‌ చట్టాల మార్పులతో సంబంధం లేకుండా వారికి వార్షిక కౌలు బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. 2023 సంవత్సరం మే నెలలో రావలసిన వార్షిక కౌలు 2024 జనవరి నెల వచ్చినా రైతులకు జమ కాలేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు వార్షిక కౌలు మాత్రమే జీవనాధారం అన్నారు. కౌలు రాక కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు వైద్య అవసరాలకు రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భూ సమీకరణ ఒప్పందం జరిగిన మూడు సంవత్సరాలలో రైతులకు ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలని భూ సమీకరణ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనటం జరిగిందన్నారు. ఇప్పటికి ఏడు సంవత్సరాలైనా స్థలాల అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం మారిన తరువాత రాజధాని నిర్మాణ కార్యకలాపాలు నిలిచి పోవటంతో రాజధాని ప్రాంతం ముళ్ళకంపతో, చెట్లతో నిండిపోయిందనీ, వెంటనే ముళ్ల కంపలను తొలగించి (జంగిల్‌ క్లియరెన్స్‌) రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యాత్మక ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కేటాయింపుల గురించి రైతులకు వివరించి, వారి అనుమతితో మాత్రమే వారి వారి గ్రామాల పరిధిలో, సరైన కొలతలతో, రహదారులతో, వీధిపోట్లు లేకుండా ప్లాట్లను అందించాలని కోరారు.
రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు నెలవారీ ఇస్తున్న పెన్షన్‌ రూ.2,500లను రూ.5 వేలకు పెంచి అందిస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు బహిరంగంగా హామీ ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని పేదల పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచి, బకాయిలతోసహా అందించాలని కోరారు.
అనంతరం పోలీసు అధికారుల సూచన మేరకు సీపీఐ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ క్యార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, రైతు జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, సమన్వయ కమిటీ సభ్యులు ధనేకుల రామారావు, బెల్లంకొండ నరశింగరావు, కల్లం రాజశేఖర్‌రెడ్డి, గుజ్జర్లపూడి అనిత, గౌర్నేని రమేష్‌బాబు, గుర్రం జయకృష్ణ, కొండెపాటి సతీష్‌, శాంత తదితరులు సిఆర్‌డిఎ కార్యాలయంలోకి వెళ్లి డిప్యూటీ కమీషనర్‌ సలీమ్‌ బాషాను కలిసి రైతుల సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన కార్యాలయం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. తాము కౌలు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగిందన్నారు. ఆర్థికశాఖ నుంచి క్లియరెన్సు రావాల్సి ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరోసారి ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామి ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *