మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 2 వ తేదీ నుండి జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునే (హోం ఓటింగ్) సౌకర్యం కల్పించేందు కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 సంవత్సరాలు పైబడి ఉన్న వయోవృద్ధులు, 40 శాతం పైబడి వికలత్వం ఉన్న దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లాలో 35 హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు చొప్పున, పామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు, మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్, పోలీస్ ఎస్కార్ట్ ఉంటాయన్నారు. ఇదివరకే 12 డి ఫారం అందజేసి హోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 9,114 మంది 85 సంవత్సరాల పైబడి ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే 22,429 మంది దివ్యాంగులు ఉన్నారన్నారు.
హోమ్ ఓటింగ్ ప్రక్రియ రెండు సార్లు జరుగుతుందని అందులో తొలిసారి ఈ నెల 2 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు, రెండవ సారి 9 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News