-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-పెనుకొండ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ‘మధ్యాహ్న భోజనం’ ప్రారంభం
-ఇంటర్ విద్యార్థులను పస్తులు పెట్టిన జగన్
-ఆకలి తీర్చుతున్న మంత్రి లోకేశ్ : మంత్రి సవిత
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. శనివారం పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించామన్నారు. ఈ పథకం వల్ల 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి రాబోయే 3 నెలల కోసం తమ ప్రభుత్వం రూ.27.39 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి మరో రూ.85.84 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతో పేద కుటుంబాల పిల్లలకు ఎంతో మేలుకలుగుతోందన్నారు. దీనివల్ల ఉన్నత విద్యకు సంబంధించి డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. అదే సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పస్తులతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండబోదన్నారు. విద్యతోనే పేదల తలరాతలు మారతాయని, ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకునే అవకావశం కలుగుతుందని మంత్రి తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులను ప్రభుత్వం పంపిణీ చేశామని మంత్రి సవిత వెల్లడించారు.
విద్యార్థులను పస్తులు పెట్టిన జగన్
రాష్ట్ర విభజన కారణంగా 2014-19లో మధ్య తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా…సీఎం చంద్రబాబునాయుడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఉన్నత విద్యతోనే పేదరికం దూరమవుతుందని భావించి సీఎం చంద్రబాబు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు ఎంతో మేలు కలిగిందని, ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశం కలిగిందని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ ఆ తరవాత వచ్చిన జగన్ రెడ్డి జూనియర్ కళాశాలలో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపేశారన్నారు. దీనివల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆకలితో పస్తులుంటూ పాఠాలు చదువుకోవాల్సిన దుస్థితి కలిగిందన్నారు. పిల్లల నోటి దగ్గర కూడు లాగేసిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి సవిత మండిపడ్డారు. పెనుకొండలో పేదలకు నిర్వహిస్తున్న అన్న క్యాoటీన్ వద్ద జూనియర్ కళాశాల విద్యార్థులు వచ్చేవారని, వాళ్ల దుస్థితి చూసి చలించిపోయామని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
ఆకలి తీర్చిన లోకేశ్…
ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్రలో విద్యార్థుల కష్టాలను స్వయంగా చూసిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేశ్…అధికారంలోకి రాగానే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ఆనాడు ప్రకటించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి అయిదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు కూడా ఉందన్నారు. ఇపుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మంత్రి లోకేశ్ శ్రీకారం చుట్టి…ఇంటర్ విద్యార్థుల ఆకలిని తీర్చారని మంత్రి సవిత కొనియాడారు. సుదూరు ప్రాంతాల నుంచి జూనియర్ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎంతో మేలు కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు.
డ్రగ్స్, గంజాయికి బానిసలు కావొద్దు
డ్రగ్స్, గంజాయి వినియోగంతో జీవితాలు దుర్భరంగా మారుతాయని మంత్రి సవిత తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అయ్యిందన్నారు. దీనివల్ల ఎందరో విద్యార్థులు, యువకులు తమ అమూల్యమైన జీవితాలను కోల్పోయారన్నారు. విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని, మత్తుకు బానిసలు కావొద్దని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు బయటకు రానివ్వబోమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధుల, అధికారులు, జూనియర్ కళాశాల సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యువతకు ఉపాధి, ఉద్యోగ భద్రతే లక్ష్యం
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ గాడి తప్పిన విద్యా వ్యవస్థను సక్రమ మార్గంలో పయనించేలా కృషి చేస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు విద్యతో ఆహార భద్రత కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి భద్రత కల్పించడమే లక్ష్యంగా రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటిని వ్యాపార వేత్తను రూపొందించేలా ప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. భవనాలకు రంగులు వేసే శ్రద్ధ బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువుపై శ్రద్ధ జగన్ కు లేదన్నారు. దీనివల్లే గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే విద్యా వ్యవస్థ గాడితప్పిందని మంత్రిసవిత ఆవేదన వ్యక్తంచేశారు.
Prajavartha Online Telugu News