గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, ఉత్పాదకాలు పెంచటానికి, వ్యాధులు నియంత్రించడానికి, పశుపోషకులకు పశుసంవర్దక శాఖ సేవలను మరింత చేరువ చేయాలన్నా లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో పశుఆరోగ్య శిబిరాలను, అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేది నుంచి 31వ తేది వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను సోమవారం తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు , రాష్ట్ర సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) , గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం , ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ది, మత్య్స శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, రాష్ట్ర పశుగణాభివృద్ది సీఈఓ ఎం శ్రీనివాసరావు తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.పశువైద్య శిబిరంలో వైద్యసేవలను మంత్రులు ప్రారంభించి, గొర్రెలు, గేదెలకు నట్టల నివారణ వాక్సినేషన్ వేసి, న్యూట్రిషన్ మల్టీ మిక్చర్ పశువుల దాణా ప్యాకెట్లను పశుపోషక రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ చాలా ముఖ్యమని అన్నారు. గతంలో 2014-19 ప్రతి జన్మభూమిలో కార్యక్రమంలో పశువుల సంరక్షణ, పశుగణాభివృద్దికి పశుసంవర్ధకశాఖ ద్వారా ప్రతి గ్రామంలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు నూరుశాతం వ్యాక్సిన్లు, అవసరమైన వైద్యపరీక్షలు అందించారన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా వీటిని నిలిపివేసి పశు సంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశుపోషకులకు మేలు చేయలన్నా ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,200 గ్రామాల్లో జనవరి 20వ తేది నుంచి 31వ తేది వరకు పశు వైద్య శిబిరాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. ప్రతిరోజు మండలంలోని రెండు గ్రామాల చొప్పున పశు వైద్య శిబిరాలను నిర్వహించి పశువులకు వ్యాక్సిన్లు వేయటంతో పాటు, పశువులకు పూర్తి స్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యచికిత్సలను అందించటం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను సక్రమంగా నిర్వహించేందుకు జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించటం జరిగిందన్నారు. దీని వలన 45 లక్షల పశుపోషణ రైతులకు మేలు జరుగుతుందన్నారు. పశుగణాభివృద్ధికి పశుపోషకులను పోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణానికి, అధిక పాల ఉత్పత్తికి పశువుల దాణా కోసం శైలేష్ గడ్డి సాగుకు నిధులను అందించటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే మరణించిన పశువులకు రూ.108 కోట్ట నష్ట పరిహారంను పశుపోషకులు అందించి ఆదుకోవటం జరిగిందన్నారు. భవిష్యత్తులోను పశుపోషకులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేయటం జరుగుతుందన్నారు. దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవసాయం, పశుసంవర్ధకతో పాటు నీటిపారుదల, ఆర్ అండ్ బీ వంటి కీలకమైన రంగాలు అస్తవ్యస్తం చేయటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి ప్రభుత్వ పాలన పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని, గత ఏడు నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను చక్కదిద్దటంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారంతో ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖ పట్నం వచ్చిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, విజయవాడ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు తెలిపారన్నారు. ఇదే సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తే రాష్ట్రాన్ని దేశానికే ఆస్థిగా ముఖ్యమంత్రి తీర్చుదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు వలన రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్న కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రూ.3000 నుంచి రూ.4000 వేలకు పెంచటంతో పాటు గతంలో కంటే రెండు గంటల ముందుగానే ఇంటి వద్దకే అందించటం జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించటంతో పాటు, భూ యజమానలుకు ఇబ్బందిగా ఉన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో గుంతలు రహిత రహదారులుగా తీర్చిదిద్దటానికి రూ. 1100 కోట్లు కేటాయించటం జరిగిందని, పల్లె పండుగలో భాగంగా రూ.5000 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రజలందరూ మెచ్చుకునేలా పరిపాలన అందిస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి యువనాయకులు నారా లోకేష్ శాసన సభ్యులుగా ఉండటం ఇక్కడ ప్రజల అదృష్టం అన్నారు. రాజకీయలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించటంతో పాటు నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రివర్గం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చిర్రావూరులో భవనం నిర్మించి పశువుల ఆసుపత్రి మంజూరు చేయలేదని, ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ పశువుల ఆసుపత్రి మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ), గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, ఎన్నారై సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన జనభాకు అనుగుణంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని, పశువుల ఆరోగ్య సంరక్షించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం పది రోజులు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పశువుల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిందన్నారు. పశుపోషణను ప్రోత్సహించేందుకు పీఎంజీఈపీ పథకంలో ఎంఎస్ఎంఈ లకు పశువుల కొనుగోలుకు డీఆర్డీఏ ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ది, మత్య్స శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ మాట్లాడుతూ పాడి పరిశ్రమలోని రైతులకు మేలు కలింగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,200 గ్రామాల్లో పశు వైద్య శిబిరాలను జనవరి 20 నుంచి పదిరోజులు పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలోని పశు సంవర్ధక సంచాలకుల నుంచి అన్ని స్థాయిలో అధికారులు , వైద్యులు, సిబ్బంది వైద్యశిబిరాల్లో అందుబాటులో ఉండి పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. గొర్రెలు, గేదెలకు నట్టల నివారణ వ్యాక్సిన్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా అందించటానికి ప్రతి సంవత్సరం నాలుగు సార్లు పశు వైద్య శిబిరాలను నిర్వహించటం జరుగుతుందన్నారు. వైద్య శిబిరాల్లో వాక్సినేషన్లతో పాటు గొర్రెలు, మేకలు, గేదేలు, ఆవులు కోళ్ళ లో ఆరోగ్య సమస్యలు గుర్తించటానికి వైద్య పరీక్షలు, పెర్టీలిటీ సమస్యల పరిష్కారంకు వైద్య చికిత్సలు అందిస్తారన్నారు. పశుపోషకులకు శాస్త్రీయ పశు యాజమాన్య పద్దతులు పశు విజ్ఞానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. పశు మరణాలను తగ్గించటానికి వ్యాక్సిన్లు, వ్యాదినిరోధక టీకాల క్యాలెండర్ ను రూపొందించి ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోపశువులకు అవసరమైన వ్యాక్సిన్లు, వ్యాధినిరోదక టీకాలు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణానికి, పశుదాణ సాగుకు నిధులు అందించటం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరక్టర్ డా. బి దామోదర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం చైర్మన్ నందం అబద్దయ్య, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరక్టర్లు డా. సత్యకుమారి, డా. వెంకట్రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ జెడీఏ డా. ఓ.నరిసింహరావు, డిప్యూటీ డైరక్టర్లు డా. పద్మవతి, డా. కేవీవీ సత్యన్నారయణ, అసిస్టెండ్ డైరక్టర్ డా. డి శ్రీనివాస రెడ్డి, మోహనరావు, మాధవి, సాంబశివరు, తాడేపల్లి మండల పశు వైద్యులు డా. పీవీఆర్ నరేంద్ర రెడ్డి , తహశీల్దారు సీతరామయ్య, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News