Breaking News

అనకాపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా పని చేస్తా…

– పోలవరం ఎడమ కాలువతో ఉమ్మడి విశాఖను సస్యశ్యామలం చేస్తాం
– ఉత్తరాంధ్ర మకుటం విశాఖ ఉక్కును కాపాడిన ఘనత కూటమిదే
– గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతా
– ప్రధాని పర్యటనలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు సంతోషం
– అనకాపల్లి కేంద్రంగా రూ.1.80 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీకి శ్రీకారం
– ఛోడవరం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర విస్తృత పర్యటన

అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి కేంద్రంగా, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఛోడవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

ఛోడవరం నియోజవకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీ మొత్తం కలియ తిరిగి ఉత్పత్తి సహా అన్ని విభాగాలను పరిశీలించారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలిచే విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం నుండి రూ.11,440 కోట్లు సాధించాం. అదే స్ఫూర్తితో సహకార రంగంలో చరిత్ర సృష్టించిన గోవాడ షుగర్ పరిశ్రమను కాపాడుకుంటానని అన్నారు. అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రిగా చోడవరం నుండే అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నానని అన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇబ్బందులను పరిశీలించిన తర్వాత పంచదార తయారీ లాభదాయకం కాదని, ప్రత్యామ్నాయ పంటలు, ప్రత్యామ్నాయ ఉత్పత్తులకు శ్రీకారం చుట్టేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుండి అందిస్తామని అన్నారు. అదే సమయంలో ఫ్యాక్టరీ వ్యర్ధాలతో సంవత్సరం పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

అనంతరం ఛోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఛోడవరం మండల తహశీల్దార్ కార్యాలయం, సబ్ జైల్‌, రైతు బజార్, కోర్టు భవనాలను పరిశీలించారు. ఐదేళ్ల క్రితం సుమారు రూ.1.60 కోట్లతో నిర్మాణాలు చేపట్టగా గత ఐదేళ్లు ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లుగా పనులు పాడు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కూటమి అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే నిలిచిపోయిన అన్ని పనుల్ని పూర్తి చేసి అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామని మంత్రి అన్నారు. అభివృద్ధి చేసేది ఎవరో, విధ్వంసం చేసేది ఎవరో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. జగన్ రెడ్డి, వారి ముఠా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నిందలు వేసిన ఎన్ని డ్రామాలాడిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది కూటం ప్రభుత్వం మాత్రమే అని మంత్రి అన్నారు.

జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఈ జిల్లాను అభివృద్ధిలో మిగిలిన జిల్లాలతో పోటీ పడేలా చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అనకాపల్లి జిల్లాలో రూ.1.80 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. తద్వారా జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా కల్పించే అవకాశం దక్కిందన్నారు. అదే సమయంలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

దాదాపు మైనస్ 7 డిగ్రీల చలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని మనం కూడా అంతకు మించి శ్రమించాలని అన్నారు. ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా మన అనకాపల్లిలో ఏర్పాటు చేసేలా దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రలోని నదుల్ని అనుసంధానించేందుకు శ్రీకారం చుట్టాం.

అనకాపల్లి జిల్లాలో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ కింద సుమారు 1200 పనులకు శ్రీకారం చుట్టామని, అందులో 65 శాతం పనులు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.172 కోట్లు, లేబర్ కాంపోనెంట్ కింద రూ.294 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే సమయంలో సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, హార్టీ కల్చర్, సెరీ కల్చర్ పనులు కూడా వేగవంతం చేశామని తెలిపారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకానికి ఆరు నెలల్లోనే రూ.600 కోట్ల వరకు ఖర్చు చేశామని తెలిపారు.

అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. ప్రతి నెలా పెన్షన్లను ఒకటో తేదీనే ఇళ్ల వద్ద అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా ప్రారంభించాం. త్వరలోనే తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వంటి పథకాలను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. వచ్చే ఏప్రిల్లో మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ.20 వేలు అందించనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. నేడు చంద్రబాబు గారి విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటాం. కేంద్రం నుండి కూడా కావాల్సిన స్థాయిలో నిధులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. స్థానిక రైతులకు ప్రోత్సాహం ఇచ్చేలా డెయిరీ ఇతర రంగాలను ప్రోత్సహించబోతున్నామని, అందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యన్నారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్, సుందరపు విజయ్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద్ సత్యన్నారాయణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *