Breaking News

మైనారిటీ సంక్షేమానికి కేంద్ర నిధులు రాబట్టుకోవాలి

-తెలంగాణ నుంచి రావాల్సిన రూ.50 కోట్లు పై దృష్టి సారించాలి
-మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించిన మంత్రి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఢిల్లీకి వెళ్లి సాధించాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన ఫేషీ లో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, కమిషనర్ శ్రీధర్, తదితర అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. 2024-2025 బడ్జెట్లో కేటాయించబడిన నిధులను విడుదల చేయించుకోవడంతో పాటు, 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మైనార్టీ శాఖకు కావాల్సిన ఆర్థిక బడ్జెట్ సంబంధ విషయాలను క్రోడీకరించి పూర్తి నివేదిక రూపకల్పన చేయాలని ఆదేశించారు. సీసీటీవీలు,డ్రోన్లు, తదితర సాంకేతిక పరికరాలను అవసరమున్న చోట వినియోగించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5000 ఆర్థిక సాయం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్ కి వెళ్లే యాత్రికులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి గైడ్లైన్స్ తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీస్ వాడాలని, పేపర్ ఫైళ్లను వెనక్కి పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని దర్గాలు, పెద్దపెద్ద మసీదులు, హాస్టళ్లలో సీసీటీవీ లతో పర్యవేక్షణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకి అందేలా జిల్లాల వారీగా అధికారులు సమీక్షా సమావేశాలు, క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజా సంబంధాలు కొనసాగించాలని సూచించారు. డీఎస్సీ కోచింగ్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు శిక్షణ, పూర్తయిన పిఎంజేవికే భవనాలకు సిబ్బంది, బడ్జెట్ కేటాయింపు, నంద్యాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిఈడీఎం శాఖ ఏర్పాటు, త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకువెళ్లి నోటిఫై అయ్యేలా చర్యలు తీసుకోవడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు, ప్రజలకు సత్వర,ఖచ్చితమైన సమాచారం అందించేందుకు వీలుగా అన్ని చర్యలు చేపట్టాలని, వెబ్సైట్లను అప్డేట్ చేయాలని తదితర అంశాలపై సమీక్షలో అధికార యంత్రాంగంతో మంత్రి ఫరూక్ కూలంకషంగా చర్చించారు.తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 50 కోట్లు, ఫైళ్లు,రికార్డులు పొందేందుకు హైదరాబాదుకు వెళ్లి అక్కడి అధికారులతో కలిసి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు

హైకోర్టు బెంచి, నల్సార్, ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుపై సమీక్ష
కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు, రాజధానిలో నల్సార్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థల సేకరణ, నిధుల కేటాయింపులు తదితర అంశాలపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్షించారు. గురువారం తన పేషీ కార్యాలయంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, తదితరులతో న్యాయ శాఖకు సంబంధించి పాలనాపరమైన పలు అంశాలపై మంత్రి సమీక్ష చేశారు. హైకోర్టు బెంచి, నల్సార్, ఇంటర్నేషనల్ లా స్కూల్ కు సంబంధించి అన్ని చర్యలు వేగవంతం చేయాలని, అవసరమైతే సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త కోర్టుల ఏర్పాటు, కొత్త భవనాల, క్వార్టర్స్ నిర్మాణానికి, వసతుల కల్పన కు అవసరమైన బడ్జెట్ అంచనాలను 2025-2026 బడ్జెట్ లో కేటాయింపుల కోసం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. న్యాయ సలహా కోసం వచ్చే ఫైళ్లకు సంబంధించి వీలైనంత త్వరగా సలహా ఇవ్వాలని మంత్రి సూచించారు. న్యాయశాఖకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిధులు రాబట్టేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, స్పెషల్ కోర్టులు, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ తో పాటు పలు అంశాలపై మంత్రి ఫరూక్ సమీక్ష చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *