-కలెక్టరేట్ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్ ను ప్రారంభించిన..
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్ఫత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్ ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావుతో కలిసి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో పంటలను పండించడం ద్వారా ఆరోగ్యకరమైన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు. జిల్లాలో 38061 రైతులు 40268 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో 390 ఎటిఎంలు మరియు 858 ఏ గ్రేడ్ లు ఉన్నాయని, వాటిలో పండించిన కూరగాయలు ఆకుకూరలను జిల్లాలోని 18 మండలాల్లో గత ఏడాది నుండి ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 18 మండలాలలో 18 స్టాల్ అలాగే మండలంలోని మేజర్ గ్రామంలో ఒకటి చొప్పున మూడు మండలాల్లో మొదలు పెట్టడం జరిగిందన్నారు. అలాగే మోడల్ మండలం అయిన గోకవరం మండలంలో ప్రతి వారం ఐదు గ్రామాలలో (కొత్తపల్లి, కామరాజుపేట, తిరుమలయపాలెం, ఎర్రంపాలెం, గుమ్మలదొడ్డి) ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ షాపులను వినియోగదారుల కొరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో కొవ్వూరు మండలంలో ప్రతి గురువారం స్టాల్ పెట్టడం జరుగుతుందన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ విక్రయ కేంద్రంలో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు బియ్యం,బెల్లం పసుపు కారం పొడులు , మినపప్పు మిల్లెట్స్ తో తయారు చేసిన జంతికలు మొదలగునవి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జె పి ఈ వరలక్ష్మి ఎన్ ఎఫ్ ఏ గౌతమ్, డిపిఎం, ఏడిపిఎం, ప్రకృతి వ్యవసాయ సిబంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News