Breaking News

నులి పురుగులు.. మాన‌సిక వికాసానికీ నిరోధ‌కాలు

-ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాలు ఏర్ప‌డ‌తాయి..
-అందుకే పిల్ల‌లు, కిశోర బాల‌లు అల్బెండ‌జోల్‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి
-జాతీయ నులిపురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నులి పురుగులు పిల్ల‌లు, కిశోర బాల‌ల్లో ర‌క్త‌హీన‌త‌, పోష‌కాల లోపాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందుకే అంద‌రూ అల్బెండ‌జోల్ మాత్ర‌ను తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

సోమ‌వారం న‌గ‌రంలోని గ‌వ‌ర్న‌ర్‌పేట చుండూరు వెంక‌ట‌రెడ్డి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగిన జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొన్నారు. అధికారుల‌తో క‌లిసి చిన్నారుల‌కు స్వ‌యంగా అల్జెండ‌జోల్ మాత్ర‌లు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నులి పురుగులు వ‌ల్ల వివిధ శారీర‌క స‌మ‌స్య‌ల‌తో పాటు మాన‌సిక ఆరోగ్యం ప‌రంగా కూడా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ఇది చ‌దువుపై ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొన్నారు. అల్బెండ‌జోల్ మాత్ర‌లు తీసుకోవ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ల బారిన‌ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌న్నారు. సోమ‌వారం 1-19 ఏళ్ల వ‌య‌సు వారంద‌రికీ అల్బెండ‌జోల్ మాత్ర‌లు పంపిణీ చేశామ‌ని.. ఇంకా ఎవ‌రైనా వివిధ కార‌ణాల వ‌ల్ల మాత్ర తీసుకోకుండా ఉండిపోతే వారికి ఈ నెల 17వ తేదీన మాత్ర‌లు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. నులిపురుగుల నిర్మూల‌నతో పిల్ల‌లకు ఆరోగ్య ప‌రంగా బ‌హుళ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌న్నారు. నులి పురుగుల నిర్మూల‌న ద్వారా ర‌క్తహీన‌త రాకుండా ఆరోగ్య‌క‌ర జీవనానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. నులిపురుగుల సంక్ర‌మ‌ణాన్ని త‌గ్గించేందుకు డీవార్మింగ్‌కు అద‌నంగా పాటించాల్సిన విష‌యాల‌ను కూడా వివ‌రించారు. శుభ్ర‌మైన నీటిని తాగ‌డం, చేతుల‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌డం వంటివాటిని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలియ‌జెప్పారు.

డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని మాట్లాడుతూ ఏడాదికి రెండుసార్లు పిల్ల‌లు, కిశోర బాల‌ల‌కు అల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మాత్ర‌ల ప్ర‌యోజ‌నాలు ఏమిట‌నే విష‌యాన్ని వివ‌రించారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, అంగ‌న్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థ‌ల్లో గోడ‌ప‌త్రిక‌ల ద్వారా నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించి.. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, న‌ర్సింగ్ త‌దిత‌ర విద్యార్థుల‌కు నులి పురుగుల మాత్ర‌ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.

ఇన్‌లాండ్ వాట‌ర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విజ‌య‌వాడ డివిజ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌ల ర‌వాణాపై విద్యార్థుల‌కు నిర్వ‌హించిన వ్యాస ర‌చ‌న పోటీల్లో విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అథారిటీ డైరెక్ట‌ర్ అజిత్‌సింగ్‌తో క‌లిపి కార్య‌క్ర‌మం అనంత‌రం బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

కార్య‌క్ర‌మంలో డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీల‌క్ష్మి, జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్య‌క్ర‌మం అధికారి, ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్ డా. మాధ‌వి, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు సీహెచ్ సుబ్ర‌హ్మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *