-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
-వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో చిట్టచివరి గృహం వరకు కృష్ణా జలాలు అందించటమే లక్ష్యంగా విశేషంగా కృషి చేయటం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలలకాలంలో నియోజకవర్గంలో కొత్తగా ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోగా.. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను సైతం కక్షపూరితంగా నిలిపివేయటం బాధాకరమన్నారు. దీంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనానీతమని ఆవేదన వ్యక్తం చేశారు. 58వ డివిజన్ పరిధి వై.వి.ఎస్టేట్ లో నిలిచిపోయిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వై.వి.ఎస్టేట్ నుంచి ఇందిరానాయక్ నగర్ వరకు పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోగా.. ఫిబ్రవరి 9, 2023న భూమిపూజ చేసుకున్నట్లు గుర్తుచేశారు. రూ. 4.16 కోట్లతో(రూ. 3.30 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు., రూ. 86.49 లక్షల వీఎంసీ సాధారణ నిధులు) 1,500KL రిజర్వాయర్ నిర్మాణానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక ప్రజలతో కలిసి ఆనాడు శంకుస్థాపన చేసుకోగా పనులు చివరి దశలో ఉన్నట్లు చెప్పారు. అలాగే రూ.3.61 కోట్ల 15 వ ఆర్ధిక సంఘం నిధులతో నీటి సరఫరా పంపింగ్ మెయిన్ లైన్ పనులు కూడా అప్పటికే పూర్తి చేసుకోగా.. శివారు ప్రాంతాలలోని చివరి ఇంటి వరకు దాదాపు 20 వేల కుటుంబాలకు త్రాగునీరు అందించటమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం జరిగిందని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమోనన్న దుగ్ధతో పనులు నిలిపివేసిందని మండిపడ్డారు. రానున్నది వేసవి కాలం కావడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి గడప గడపకు త్రాగునీరు అందేదని తెలియజేశారు.
ప్రజావసరాలను గుర్తించడంలో విఫలం
ప్రజావసరాలను గుర్తించడంలో కూటమి సర్కారు తొలి నుంచి విఫలమవుతూనే ఉందని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో దావు బుచ్చయ్య కాలనీలో రూ. 3.30 కోట్ల అంచనాలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించడంతో పాటు గంగిరెద్దుల దిబ్బ నుంచి జీవీఆర్ నగర్ వాటర్ ట్యాంక్ వరకు రూ. 3.29 కోట్ల వ్యయంతో 400mm మంచి నీటి సరఫరా పంపింగ్ మెయిన్ పనులు పూర్తి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా.. ఓవర్ హెడ్ ట్యాంక్ ని వినియోగంలోకి తీసుకొచ్చే దిశగా ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ చేస్తున్న తాత్సారం కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి గాను సంపు నిర్మాణం చేపట్టి పూర్తిచేసినప్పటికి.. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పూర్తిస్థాయిలో కనెక్షన్లు ఇవ్వలేకపోయామన్నారు. కనుక ప్రభుత్వపెద్దలు రైల్వే డిఆర్ఎంతో మాట్లాడి రామకృష్ణాపురం రైల్వే వంతెన కిందుగా యూజిలైన్లు వేసి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే దిశగా కృషి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, వీఎంసీ మొద్దునిద్ర వీడి గత ప్రభుత్వంలో పూర్తి చేసుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లను వినియోగంలోకి తీసుకురావాలని.. లేనిపక్షంలో ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News