-క్రమశిక్షణతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట
-శిరస్త్రాణం ధరించడం ఒక ఫ్యాషన్ గా మారాలి…
-ప్రతీ ఒక్కరు బాధ్యతగల పౌరులుగా మెలగాలి.
-సృష్టి లో ప్రాణానికి మించిన విలువైన ఆస్తి లేదు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారులపై జరిగే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోకుండా రహదారుల భద్రత, రవాణా శాఖల సూచించిన నిర్దిష్ట ప్రమాణాలు పాటించటం తో పాటు ద్విచక్ర వాహన దారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి ఎన్టీఆర్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం గాంధీనగర్ లోని ఎన్జీజిఓ హోమ్ లో శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై వాహనాలతో ప్రయాణించే సందర్భంలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చాలామంది వాహనదారులు తనకేమి ప్రమాదం జరగదు… తాను రోడ్డుపై చాలా జాగ్రత్తగా ఉంటాను అనే భ్రమలో ఉంటారన్నారు. కానీ ప్రమాదాలు అనేవి ఎప్పుడైనా.. ఎవరికైనా జరగవచ్చు అనే స్పృహను కలిగి ఉండటం తప్పనిసరి అన్నారు. రహదారులపై వాహనదారుల భద్రతపై నిరంతరం అవగాహన ప్రచార కార్యక్రమాలు జిల్లా రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ఎన్నో ప్రాంతాలను గుర్తించి ప్రమాద నివారణ కోసం రహదారుల మరమ్మత్తులు చేయడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటికీ కొంతమంది బాధ్యత లేని పౌరులు చేస్తున్న తప్పుల కారణంగా కొన్ని అవాంఛిత ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒక ప్రమాదం జరిగితే ఆ ఒక్క వ్యక్తి కాకుండా అతనిపై ఆధారపడిన ఎన్నో జీవితాలు ప్రభావితం అవుతాయని పేర్కొన్నారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగ ఆవశ్యకతను గురించి ప్రచారం చేయాలన్నారు. ఇప్పటివరకు రవాణా, పోలీస్ శాఖల అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులతో 100% హెల్మెట్ ధారణ సాధించాలన్నారు. రవాణా, పోలీస్ శాఖల సంయుక్తంగా హెల్మెట్ ధరించని వారిపై. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత నెల రోజులుగా జిల్లా రవాణా శాఖ హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై వివిధ రూపాల్లో చేసిన ప్రచార కార్యక్రమాలలో వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు సంఖ్యలో పాల్గొని ద్విచక్ర వాహనదారులలో చైతన్యం పెరిగేందుకు కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు, రోడ్డు భద్రతపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం వంటి అంశాలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, సామాజిక మాధ్యమాలలో తమ వంతు బాధ్యతగా ప్రచారం నిర్వహించిన ప్రసార మాధ్యమాల ప్రతినిధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ మనకంటే పేద దేశాలలో కూడా రహదారులపై వాహన చోదకులు ఎంతో క్రమశిక్షణగా వాహనం నడుపుతున్నారని గుర్తు చేశారు. సరైన రహదారులు కూడా లేని ఎన్నో దేశాలు వాహన ప్రమాదాలు అతి తక్కువ శాతంతో ఉన్నాయన్నారు. మనదేశంలో వాహన ప్రమాదాలు పెరగడానికి కారణం పౌరులలో క్రమశిక్షణలోపించడమేమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు కూడా కొన్ని సందర్భాలలో హెల్మెట్ ధరించి వాహనం నడపడం లేదన్నారు. ఇకనుంచి అయినా ఉద్యోగులు బాధ్యతగల పౌరులుగా హెల్మెట్ ధరించి మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని తమవంతు సహకారం అందించేందుకు సిద్ధం గా ఉంటారన్నారు.
జిల్లా రవాణాధికారి ఎ. మోహన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం అనేది పౌరుల రక్షణ కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ఎంతో విలువైన మానవ జీవితాన్ని కోల్పోవడం అవివేకం అనే విషయాన్ని ప్రతి ద్విచక్ర వాహన దారుడు గుర్తించిన రోజున రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంటుందనే కఠినమైన నిజాన్ని సమాజంలోని ప్రతి పౌరుడు ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపితే… అతనితోపాటు అతనిని అనుసరించే వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడతారన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాహనం నడిపేందుకు ఇబ్బంది కలుగుతుందని కొంతమంది భావిస్తుంటారన్నారు. ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదన్నారు. ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులు తమ తమ సామాజిక మాధ్యమ ఖాతాలలో హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఎన్నో కలలు కంటామన్నారు. అటువంటి కలలు సాకారం కావాలంటే ఆయా కుటుంబాలలో కుటుంబ పెద్ద బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనం నడిపినంత కాలం మీ కలలు సజీవంగా ఉంటాయన్నారు. కుటుంబ పెద్ద నిర్లక్ష్యం వహిస్తే కుటుంబం మొత్తం అట్టడుగు స్థాయికి జారిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. గత నెల రోజులుగా వాహనదారులకు అవగాహన కల్పించిన అధికారులే రేపటి నుంచి హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని, నగర పాలక సంస్థ జోనల్ కమిషనర్ ప్రభుదాసు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి ఆర్. ప్రవీణ్ కుమార్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం. రాజుబాబు, నెహ్రూ యువ కేంద్రం డివైఓ ఎస్. రాము, ఎన్సిసి సమన్వయకర్త రమేష్, తదితరులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, విద్యార్థిని విద్యార్థులు, ద్విచక్ర వాహనాల అధీకృత పంపిణీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News