-వ్యర్ధాల నుండి సంపద తయారుచేయడంలో అందరూ సహకరించాలి- కె విజయానంద్, చీఫ్ సెక్రెటరీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఇంటి వద్దనే, వ్యర్ధాలు వేరు చేసే ప్రక్రియను అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్. శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో, 63వ డివిజన్ రాజీవ్ నగర్, ఆయుర్వేద హాస్పిటల్ నందు నిర్వహించిన, స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి వద్దనే వ్యర్ధాలు వేరు చేసే ప్రక్రియను అవగాహన కల్పించే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటుచేసిన స్టాల్ ను సందర్శించారు, మూడు రంగుల చెత్తబుట్టలను ఏ విధంగా వాడాలి, తడి చెత్త అనగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఎండిపోయిన పళ్ళు, పువ్వులు, వండి మిగిలిపోయిన ఆహార పదార్ధములు, తడి పేపర్లు, టిష్యూ పేపర్లు, పచ్చ రంగు చెత్తబుట్టలో వేయాలని, పొడి చెత్త అనగా ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, వాటర్ బాటిల్స్, పాల కవర్లు, న్యూస్ పేపర్లు, ఇలాంటివి నీలిరంగు చెత్తబుట్టలో వేయాలని, హానికరమైన చెత్త అనగా మాస్కులు, డైపర్లు, సానిటరీ నాప్కిన్స్, రక్తపు బట్టలు, సానిటరీ టిష్యూ పేపర్, సిరంజులు, సూదులు, పగిలిపోయిన గాజు సీసా లాంటివి ఎరుపు రంగు చెత్తబుట్టలో వేయాలని , ఇంటి వద్దనే ఎరువును ఎలా తయారు చేయాలి, అని అవగాహన కల్పించే స్టాల్ ను వీక్షించారు.
ప్రజలు దోమ కాటు వల్ల, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఫాగింగ్ , స్ప్రేయింగ్, డ్రోన్ స్ప్రేయింగ్, యాంటి లార్వా ఆక్టివిటీస్, చేసే స్టాల్ సందర్శించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను వీక్షించారు.
సోర్స్ రిసోర్స్ అనే నేపథ్యంతో ఈ నెల చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాకథాన్ ర్యాలీను చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని, రాజీవ్ నగర్ లో మొదలుపెట్టి, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో స్వయంగా తానే ప్రజల వద్దకు వెళ్లి మూడు రంగుల చెత్త బుట్టలు, వాటిలో వేయవలసిన వ్యర్ధాలు గురించి అవగాహన కల్పించడమే కాకుండా వారు వాడుతున్న చెత్త బుట్టలను స్వయంగా తానే చూశారు. గృహిణులు వారు వాడుతున్న చెత్తబుట్టలను చూపి, వ్యర్థాలను వారు వేరు చేస్తున్న ప్రక్రియని విని సంతోషించారు.
ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివస్ ను, పక్కా ప్రణాళికతో సిద్ధం చేయాలని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల తమ బాధ్యతను నిర్వహించాలని, ఇంటి వద్దనే వ్యర్ధాలను వేరు చేసి వ్యర్ధాల నుండి సంపదను సృష్టించాలని తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి వాటిని రీసైకిల్ చేసే విధంగా అందరూ సహాయపడాలని, అందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలకు, మూడు రకాల బుట్టలను విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు అందించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్ధాలు వేరుచేసి ఇవ్వాలని అవగాహన కల్పించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నారని, సేకరించిన వ్యర్థాలను రీసైకిల్ చేసి, సంపదని సృష్టించవచ్చని తెలిపారు. ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై విజయవాడ నగర పాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తోందని, ప్రజలకు వినియోగదారులకు వాటిపై ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నారని, అతి త్వరలో వాటిపై ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టబోతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సురేష్ బాబు, జాన్ డైరెక్టర్ డాక్టర్ లతా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, బయాలజిస్ట్ సూర్య నాయక్, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News