మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తడి పొడి చెత్త సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో తడి పొడి చెత్త సేకరణ, ఎమ్మెస్ఎంఈ సర్వే పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా కొంతమంది తడి పొడి చెత్తను వేరు వేరుగా కాకుండా కలిపే ఇస్తున్నారని, దీనిపై పారిశుద్ధ్య సిబ్బందికి కూడా అవగాహన లేనట్లుగా కనిపిస్తోందని, ప్రజలతోపాటు సిబ్బందికి తగిన అవగాహన కల్పించాలన్నారు.
తాను నగరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో తడి పొడి చెత్త సేకరణపై ఆకస్మిక తనిఖీలు చేపట్టినప్పుడు మాత్రమే అధికారులు, పారిశుధ్య నిర్వహణ సిబ్బంది స్పందిస్తున్నారని, మిగతా సమయాలలో దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ పద్ధతిని విడనాడి స్వచ్ఛ జిల్లా దిశగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈ సర్వే పురోగతిపై ఆయన మున్సిపాలిటీలు, మండలాల వారీగా సమీక్షిస్తూ, వ్యాపార యజమానుల చిరునామాలను గుర్తించేందుకు విద్యుత్ శాఖ ద్వారా జియో కోఆర్డినేట్ పరికరాలను సిబ్బందికి అందించినప్పటికీ సర్వేను ముందుకు తీసుకువెళ్లడంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు శ్రద్ధ పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో సరైన ప్రణాళికతో ముందుకు సాగి సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Prajavartha Online Telugu News