-నగర పాలక సంస్థకు చెల్లించవలసిన మొండి బకాయిలను ఈ నెల 10వ తారీఖులోపు చెల్లించాలని, చెల్లించనిచొ బకాయిదారుల ఆస్తుల సీజ్ చేయుటయేకాక బకాయిదారుల జాబితాలను బహిరంగ ప్రదేశాలలో ప్రచురించుట జరుగుతుంది… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఏ.యస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థకు దీర్ఘకాలికంగా మరియు మొండి బకాయిలున్న ఆస్తి పన్ను యజమానులకు పన్ను చెల్లింపునకు ఈ నెల 10 వరకు మాత్రమె ఆఖరి గడువు, బకాయిదారులు ఆస్తి పన్ను బకాయిలను, ప్రస్తుత సంవత్సరపు పన్నును వెంటనే చెల్లించాలని లేనిచో 11 నుండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేయుట జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. మంగళవారం కమీషనర్ తమ ఛాంబర్ నందు రెవిన్యూ వసూళ్ళ పై రెవిన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరియు డిప్యూటి కమిషనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
సదరు సమావేశం నందు రెవిన్యూ అధికారులు మరియు ఇన్స్పెక్టర్ల వారీగా రెవిన్యూ వసూళ్ళ పై సమీక్షించి, అధిక మొత్తంలో బకాయిలు ఉండుట గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 – 2025 ఆర్ధిక సంవత్సరం ముగింపు వస్తున్నప్పటికీని ప్రస్తుత సంవత్సమే కాకుండా దీర్ఘకాలిక బకాయిలు ఉండుట పై డిప్యూటి కమిషనర్ అధికారి స్తాయిలో పన్ను వసూళ్ళకు హాజరై బకాయిలు వసూళ్లు చేయాలని గత సమావేశంలోనే ఆదేశించడమైనదని, బకాయిదారులు చెల్లించే దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని, మొండి బకాయిదారులకు పన్ను చెల్లింపునకు ఈ నెల 10 వరకు మాత్రమె గడువు ఇవ్వడం జరుగుతుందని, అనేక పర్యాయాలు చెప్పినప్పటికిని పన్ను చెల్లించని యజమానుల ఆస్తి సీజ్ చేయుటయే కాక బకాయిదారుల జాబితాలను బహిరంగ ప్రదేశాలలో బ్యానర్ల ద్వారా ప్రచురించుట జరుగుతుందన్నారు. నిర్దేశిత గడువు దాటిన పిదప రెవిన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరియు డిప్యూటి కమిషనర్లు బృందాలుగా ఏర్పడి, బకాయిదారుల ఆస్తులను సీజ్ చేయాలని ఆదేశించారు. బకాయిదారుల నీటి కుళాయిలను, డ్రైన్ కనెక్షన్లు మరియు అత్యవసర సేవలు నిలిపుదల చేయాలన్నారు. అప్పటికి స్పందించనిచొ బకాయిదారులకు ఆస్తుల జప్తుకు నోటీసు జారీ చేయాలన్నారు.
సందర్భంగా కమిషనర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, నగర పాలక సంస్థకు ప్రస్తుత సంవత్సరంతో పాటు బకాయిలున్న ఆస్తి యజమానులు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి కుళాయి చార్జీలను నిర్దేశిత గడువు ఈ నెల 10 లోపు చెల్లించాలన్నారు. 11 నుండి బకాయిదారుల పై నగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మార్చి నెలలో సెలవు రోజుల్లో కుడా క్యాష్ కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయని, పన్నులను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా ఆన్లైన్ ద్వారా cdma.ap.gov.in నందు మరియు చెక్కులు మరియు డి డి ల ద్వారా చెల్లించవచ్చన్నారు. మార్చి నెలలో ఆస్తి పన్ను పై వడ్డీ మాఫీ కోసం వేచి చూడకుండా పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.
సదరు సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్లు డి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, టి. వెంకటకృష్ణయ్య, ఆర్.ఓ లు మదన్ గోపాల్, రవికిరణ్ రెడ్డి, సాదిక్ బాషా, రెహమాన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News